పుట:Kanyashulkamu020647mbp.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుచ్చ : వెళ్లిపోకండి.

గిరీ: నేనుమాత్రం పోయే సాధనం యలాగ? యెన్నోమాట్లు యేవఁనుకుంటాను? యీ పెళ్లి తప్పించ లేకపోయినానుగదా? నాప్రాణంకంటే యిష్టవైఁన యీ బంగారపు బొమ్మలాంటి బుచ్చమ్మని పునిస్త్రీని చెయ్య లేకపోయినానుగదా? అని విరక్తిపుట్టి, పోదాం అని నిశ్చయించే సరికి - కాలు ముందుకువేసినా, మనస్సు వెనక్కిలాగి యేమితోచేదీ? "పైకి పోతానని సందడి పడుతున్నాను. నాబుచ్చమ్మ కనపడకపోతే, పోయి బతకడం యలాగ? దానికి యంత కనికరం లేకపోయినా, యిక్కడేవుండి, చూసైనా సంతోషిద్దాం" అని వుండి పోతూ వొచ్చాను.

బుచ్చ : మీరు చెబితే, లుబ్ధావుఁధాన్లుగారు పెళ్లి మానుకుంటాడని తమ్ముడుచెప్పాడు?

గిరీ : నే చెప్పినమాట, యీ భూప్రపంచంలో యవడూ కొట్టివెయ్యలేడు. అందుచేత, వెంకటేశం అలా అని వుంటాడుగాని, మీతండ్రి ఒకడు, మా అన్న వకడు లోకాతీతులు. వాళ్లు బ్రహ్మచెబితే వినరు. ఈయనకి వెఱ్ఱికోపం. అతగాడు శుద్ధపీసిరిగొట్టు. మాఅన్న సుఖపడ్డానికా యీపెళ్లి తలపెట్టాడు? నీమొగుడు నిన్నుపెళ్లాడి యంతసుఖపెట్టాడో, మాఅన్న నీచెల్లెల్ని పెళ్లాడి, అంతే సుఖపెడతాడు. ఆఫ్రికాదేశంలో స్లేవరీ అనివుంది. అనగా మనుషుల్ని వట్టి పశువుల్లాగ బజార్లలో అమ్ముతారు. యవరు కొనుక్కుంటే వాళ్లయింట్లో అయామనిషి బతికినన్నాళ్లూ చాకిరీ చెయ్యాలి. అలాగ్గానే మా అన్న, మీచెల్లెలిని పెళ్లిఅనే మిషపెట్టి, కొంటున్నాడు. వాడింట యిది జీతంలేని బాపనక్కలాగ పనీపాటూ చేస్తుందని, వాడి ఆశ. నేను కూడదని యంత గడ్డిపెట్టినా విన్నాడుకాడు. యీ కష్టాలన్నీ యిలా వుండగా నాకు మరోభయం వేస్తూంది. చెబితే కోపంతెచ్చుకోవుగద?

బుచ్చ: మీరేం చెప్పినా నాకు కోపంలేదు.

గిరీ: ఆమాత్రం ధైర్యవిఁస్తే, నాక్కావలసిందేవిఁటి? రామచంద్రపురం అగ్రహారీకులు బహు దుర్మార్గులు - మాఅన్న చచ్చిపోయినతరవాత నీ చెల్లెల్ని తిన్నగా ఉండనియ్యరు. అదికూడా మా మీనాక్షి మోస్తరౌతుంది.

బుచ్చ: మీనాక్షికేం లోపంవొచ్చింది?

గిరీ: యేవఁనిచెప్పను? కడుపుచించుకుంటే కాళ్లమీద పడుతుంది. అయినా నీదగ్గిర నాకు దాపరికం యేవిఁటి? దానిమొగుడు పోయినతరవాత యేటేటా కడుపు అవుతూవుండడం. అయినప్పుడల్లా వొల్లమాలిన అల్లరిన్నీ. ఒకప్పుడు అది ప్రాణభయంకూడా చేస్తుంది. ఆవూళ్లో రావఁప్పంతులని వొక పరమదుర్మార్గుడు నియ్యోగప పంతులు వున్నాడు. వాడు ఒక సానిదాన్ని వుంచుకున్నాడు. యెందరినో సంసార్లని చెడగొట్డాడు. మా అన్న వ్యవహారాలన్నీ ఆపంతులే చూస్తాడు. మా అన్న చచ్చిన ఉత్తరక్షణం, నీ చెల్లెలికి వొల్లమాలిన ధనం