పుట:Kanyashulkamu020647mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిరీశం-- యేవఁనా? ఓ దేవుఁడా! నామనస్సు యిండిపెండెంటుగా సృజించావా? లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే, నా యిష్టవొఁచ్చినపనల్లా నేను చేశాను. నువ్వెవరు, అడగడానికి? యిలాంటి చిక్కులు పెట్టా`వంటే హేవెన్‌లో చిన్న నేషనల్‌ కాంగ్రెస్‌ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అష్లాగయితే నువ్వే నాచేత పాపంచేయించావు గనక నీకే ఆశిక్ష కావలిసింది. దేర్‌పోర్‌ చలో, నరకానికి, చలో! అక్కణ్ణించి నువ్వు తిరిగీ వొచ్చేలోగా, ఆరుఘడియలు స్వర్గంలో నీ అధికారం, నాకిస్తివట్టాయనా, కొన్ని సృష్టిలో లోపాలు సవరణ చేస్తానంటాను.

వెంక: యేవిఁటండి లోపాలు?

గిరీ: లోపాలన్న లోపాలా! నీచేతే వొప్పిస్తాను. నెంబర్‌వన్‌ - నీ మేష్టరులాంటి అభాజనుణ్ణి పుట్టించడం లోపం అంటావా అనవా?

వెంక: లోపవేఁ.

గిరీ: నీసిస్టర్‌లాంటి బ్యూటిఫుల్‌ యంగ్‌ గర్లుని, విడోని చెయ్యడం తప్పంటావా, ఒప్పంటావా?

వెంక: తప్పే.

గిరీ: యిలాంటి లోపాలు కోటానకోట్లు. ఇక రద్దుసృష్టి యంతుందనుకున్నావు? ఫరిన్‌స్టెన్స్‌, యెన్ని సముద్రాలు వున్నాయి?

వెంక: యేడు.

గిరీ:-- యేడూ, యేడిసినట్టేవున్నాయి. పాలసముద్రం వుంటూవుండగా మళ్లీ పెరుగుసముద్రం, నేతిసముద్రం యెందుకోయి? యిది ప్లియోనిజమ్‌, పునరుక్తి- మరో తెలివితక్కువ చూశావా? యెందుకూ పనికిమాలిన ఉప్పుసముద్రం మననెత్తినికొట్టి, పెరుగు, పాలు, నెయ్యి, చెరుకుపానకం యీ సముద్రాలన్నీ యవడికీ అందుకు రాకుండా దూరంగా విసిరేశాడోయి. ఒక సంవత్సరంగాని నాకు దేవుఁడు దివాన్గిరీ యిస్తే, భీమునిపట్ణానికి పాలసముద్రం, విశాఖపట్ణానికి మంచినీళ్ల సముద్రం, కళింగపట్ణానికి చెరుకుసముద్రం తెస్తాను. యీ యీస్టర్ను ఘాట్సు అంతా పొగాకు అరణ్యం చేస్తాను. యీ లెక్చరు నేను కొట్టే సరికి, దేవుఁడు యేవఁంటాడో తెలిసిందా? వీడు అసాధ్యుళ్లావున్నాడు. వెనకటికి "పాతయముడివా కొత్తయముడివా" అని అడిగిన పెద్దమనిషికంటే ఒక ఆకు యెక్కువ చదువుకున్నట్టు కనపడతాడు. గనక వీడికో జోడు గుఱ్ఱాలబండీ యిచ్చి, స్వర్గంలో వున్న యావత్తు మహలులు, బగీచాలూ చూపించి, యేం కావాలంటే అది యివ్వండని దేవదూతలతో చెబుతాడు. నా శిష్యుడు, వెంకటేశాన్నికూడా తీసుకొస్తేగాని, నాకేం తోచదని నే చెబుతాను. అప్పుడు నిన్ను విమానమ్మీద తీసుకొస్తారు. మన విఁద్దరం స్వర్గంలో మజా వుడాయిద్దాం.