పుట:Kanyashulkamu020647mbp.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5-వ స్థలము. కృష్ణారాయపురం అగ్రహారంలో.

(అగ్నిహోత్రావధాన్లు యింటిపెరటిలో గిరీశం పనివాళ్లచేత పందిరి వేయించుచుండును.)

[వెంకటేశం ప్రవేశించును.]

గిరీశం: యేమివాయ్‌ బావా, యెడందవడ యెఱ్ఱబారింది?

వెంకటేశం: నాన్న గూబగదలేశాడు.

గిరీ: యేంజేశావు?

వెంక: సంధవార్చలేదని.

గిరీ: ఆమాత్రం వార్చినట్లు వేషం వెయ్యలేకపోతివో?

వెంక: చూడ్డనుకున్నాను.

గిరీ: అను కోడాలుపనికి రావోయి, బావా! మనం యేదైనా వేషం వేశావంటే, ఒకడు చూస్తున్నాడని అనుకున్నప్పుడూ, ఒకడు చూస్తూవుండలేదనుకున్నప్పుడూ కూడా, వొక్కమోస్తరుగా వేషం నడిపిస్తే సేఫ్‌ సైడ్‌. చూస్తున్నావుకావా, రోజూ నేను యెంతసేపు బక ధ్యానంచేస్తానో?

వెంక : యేవఁని ధ్యానం చాస్తారు?

గిరీ: యేం ధ్యానవాఁ? యీ చాదస్త బ్రాహ్మడు యంతట్లో దేవతార్చన చాస్తాడు, యంతట్లో విస్తట్లో మెతుకులు పడతాయి అని తదేకధ్యానం చేస్తాను.

వెంక: మంత్రాలు చదివి దేవుఁణ్ణి ధ్యానం చెయ్యాలిగాని, అన్నంకోసం ధ్యానంచేస్తే పాపంకాదా?

గిరీ: ఇగ్నొరెన్స్‌! మతసంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. యీ పెళ్లి అయిపోయిన తరవాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్నిమతాలూ పరిశీలించి వాటితాలూకు యసెన్స్‌, నిగ్గుతీసి ఓ కొత్తమతం యేర్పర్చాను. అది అమెరికా వెళ్లి ప్రజ్వలింపచేస్తాను. యిప్పడుమట్టుకు నీ సంశయం తీరుస్తాను. యేమన్నావ్‌? అన్నాన్నా ధ్యానించడం, అని కదూ? యేవఁందోయి నీ ఉపనిషత్తు? "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌" అన్నవేఁ, బ్రహ్మ. అని తెలుసుకోవోయి, వెధవాయా, అంది. తెల్లవాడు యేవఁని ధ్యానం చేస్తాడోయి రోజూనూ? "ఫాదర్‌, గివ్‌, అస్‌ అవర్‌, డెయిలీ బ్రెడ్‌" అనగా "నన్ను కన్నతండ్రీ, రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని"- ఇక, మనవేఁవఁనాలి? "తండ్రీ రోజూ, కందిపప్పు, ధప్పళం ఇయ్యవయ్యా" అని ధ్యానించాలి. మన చమకంలో యేమన్నాడూ? "శ్యామాకాశ్చమే" "చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుఁడా! అన్నాడు"