పుట:Kanyashulkamu020647mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ-- అందరితోటీ అంటే యవరెవరితోటి?

కొండి-- యవరెవరా అండి? పెళ్లి వొదిలేసి, అంతా మధురవాణి చుట్టూమూగాం. భుక్తగారితో మాట్లాడింది. మరేవచ్చి.

రామ-- యింకా యవరితో మాట్లాడింది?

కొండి-- సిద్ధాంతి మంత్రం చప్పడం మానేసి మధురవాణి చెవులో యేకాంతం మాట్లాడాడు.

రామ-- మరింకా యవరితోటి?

కొండి-- మరేవచ్చి- హెడ్డు కనిష్టీబుతోటి.

రామ-- ఓరి ఛండాలుడా! హెడ్డుతో మాట్లాడ లేదన్నావే?

కొండి-- అవును మాట్లాళ్లేదు.

రామ-- పుండాఖోర్‌! మాట్లాడిందా మాట్లాళ్లేదా?

కొండి-- సచ్చాన్రా దేవుఁడా!

రామ-- అసత్యం అంటే, నాకు వెఱ్ఱికోపం. ప్రమాణ పూర్తిగా, నిజంచెప్పు. అబద్ధవాఁడితే, తల పేలిపోతుంది. మాట్లాడిందాలేదా?

కొండి-- లేదు.

రామ-- ప్రమాణ పూర్తిగా?

కొండి-- ప్రమాణ పూర్తిగానే.

రామ-- యిప్పుడు నిజంచెప్పావు. విన్నావా? నీకు చిన్నతనం; ఆడవాళ్లమీద, ఒహరు అనమన్నా, అన్యాయంమాటలు ఆడకూడదు. తెలిసిందా?

కొండి-- మధురవాణి మా దొడ్డమనిషి.

రామ-- వూళ్లో అలా అనుకుంటారేం?

కొండి-- అంతా అనుకుంటారు.

(రామప్పంతులు యింటియెదట.)

రామ-- నేను తలుపుకొడతాను, నివ్వో చిన్నగమ్మత్తుచెయ్యి.

కొండి-- చిత్తం.

రామ-- యీ విచ్చబేడమొలనిపెట్టుకో. మా పెరటిగోడ అవతల, ఒక అరఘడియ నిలబడు. దిడ్డీ తోవంట కనిష్టేబుగాని, మరెవరుగాని, పైకి వొచ్చినట్టాయెనా, రెక్కపట్టుకుని, కేకెయ్యి. నేవొస్తాను. లేకుంటే వుడాయించెయి. (కొండిభొట్లు నిష్క్రమించును.) తలుపు తలుపు. (తనలో) ఒకంతట తలుపుతియ్యదు. అనుమానా నిక్కారణం. వీడు నిజంచెప్పాడా? అబద్ధం చెప్పాడా? నేను పాలెంనించి వొచ్చి కబురు పంపించిన తరవాత రాక, యిది తుఱ్ఱుమని యలాపరిగెత్తి వెళ్లిందీ పెళ్లిలోకి? తలుపు తలుపు! యప్పటికీరాదేం!