పుట:Kankanamu020631mbp.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ. అకలంకోజ్జ్వల తారలం బొదివి భావాభావ మధ్యాల్ప తా
    రక లందందునఁ జుట్టుజేరె ముదమారన్ రత్నభూషాంబర
    ప్రకరోద్యద్రమణి జనాభరణ సౌభాగ్యంబువీక్షించు వే
    డుకతోడన్ నిరుపేదరాండ్ర రిగిచుట్టుంజుట్టు చందంబునన్.

గీ. తఱచు తెగి వ్రాలుచుక్కలు ధరణిఁ బడఁగ
   నెడములేక మామేఘాళి నడుమఁ జిక్కి
   యొండొకనభంబు గల్పించుచుండె మాకు
   నభ్ర మన్వర్థనామధేయంబు గాఁగ.

శా. దేశంబున్ విడియేగె భర్త, జగమెంతేమెచ్చు మీమేఘసం
    దేశంబన్నను, మాకు నున్న దొకసందేశంబుగొంపోయి మా
    యాశల్ దీర్పుఁడటంచు దెల్పుఁడని చంద్రాబ్జాన్యలంపన్ దదా
    దేశంబుం గొనివచ్చు దూతికలరీతిన్ వ్రాలె నత్తారకల్.

మ. అమితోగ్రాకృతి నుద్భవించి సకలాశాంతంబులన్ శ్రీమహే
    శ మహాలింగము వ్యాప్తమౌ నెడవిరాజత్పారిజాత ప్రసూ
    నములన్ వేల్పులు పూజసల్పెడు విధానంబెల్ల మా మేచకా
    భ్రముపై వ్రాలెడు తారకావళిస్ఫురింపంజేసె మాకయ్యెడన్.

శా. తారామండలమందె యంతవఱకంతర్భూతుఁడై వింట దు
   ర్వారాస్త్రంబులఁ గూర్చి మారుతుడు మా పైనిం బ్రయోగింపఁ ద
   న్నారాచానలకీలికావళియొనా నాఁ డావియన్నిర్లళ
   త్తారావారము మా కపారభయదోత్పాతంబె యయ్యెంగటా!