పుట:Kankanamu020631mbp.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. మండు వేసగిలోని నిండుపున్న మనాఁటి
         జాబిల్లి వెన్నెల చలువలందు
   ప్రత్యూష సమయ సంభవమంద మలయమా
         రుతకోమలతరంగ హతులయందు
   పాలబుగ్గలు లొత్తవడ నోరఁ జొల్లూర
         బసిపాప లను ముద్దుపలుకులందు
   మందారమకరంద మాధుర్యధుర్యస
         త్కావ్యభవ్యకవిత్వ గతులయందు

   గలుగు వివిధసుఖంబు లొక్కటన చేర్చి
   పేర్చి గానం బనెడు పేరు గూర్చి సకల
   భోగ్యముగఁ జేసినట్టి యంభోజభవుని
   సృష్టి విరచనావిభవ మచ్చెరువు గాక.

ఉ. ఆయ సమానగాన విభవానుభవం బది చెప్పినంతసే
   పాయెనొ లేదొ నాదు శ్రవణావధి కెంతయు దాఁటిపోయినన్
   దోయకణంబు నేమఱలఁ దోయకణంబు నెయౌచుఁజింతతోఁ
   దోయమువారలంగలసితో యద మండలమందునుండఁగన్.

సూర్యాస్తమయము

శా. ఆటంకంబు ఘటించినార మఁట స్వీయాంశు ప్రభావ్యాప్తిక
   త్యాటోపంబున భానుఁ డావలి మొగంబై, మాపయిం దానిరా
   ఘాటక్రోథవిలోకనారుణసమగ్ర స్ఫూర్తులం గొల్పె; హా
   చేటౌ కాలమునన్ సమస్తగతులన్ జేటే కదా వాటిలున్!