Jump to content

పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిలుకబ్రహ్మరాక్షసుడైనకథ.

193

అని పలుకుచు రౌద్రావేశంబున నతండా నక్తంచరుం దాకు.టయు వాఁడచ్చేడియను విడిచి రాజపుత్రు సమాంతముగా నెత్తికొని బుజముపై నిడికొని యందున్న సుందరులెల్ల నాక్రందనముసేయ నెగసి కోటదాటి యవ్వలకుఁ బోవుచుండెను. అప్పుడారాజపుత్రుఁడు వాని బుజంబుననుండియే కరవాల ముంకించి కుడికరంబు నఱికి పారవైచెను. వాఁడు మేనంతయుఁ గ్రొత్తనెత్తురుగార గర్జించుచుఁ బరిటీలు తిరుగుచుండెను.

వానినిమిత్తమై గుఱ్ఱములెక్కి, తిరుగుచున్న మువ్వురు మహావీరులు ఆకసమున వానిఁ జూచి శరముల నేసి నొప్పించిరి. మఱియు గళాభిరాముఁడు సమయమరసి యయ్యడిదమున రెండవచేయి గూడ నరికినంత ఱెక్కలు విరిగిన పక్షివలె వాఁడు పెద్దధ్వనిచేయుచు నేలం గూలెను. అప్పుడు కోయదొరయు మఱియిర్వురు వీరులును వాని దాపునకువచ్చి కళాభిరాముని గ్రిందఁబడకుండఁ గాపాడియారక్కసుని యవయవములన్నియు ఖండించి వానిం గతాసుంజేసిరి.

అప్పుడు కళాభిరాముఁడు గుఱ్ఱములపై నున్న సుధర్మ సులోచనులం గురుతుపట్టి సోదరులారా! మీతో దిరుగుచున్న యీకోయ వాఁడెవ్వఁడు. హరివర్మ యేమయ్యె? విద్యాసాగరునివార్త. యేమైనం దెలిసినదియా? మన మెందువిడిపోయితిమో జ్ఞాపకములేదు. మీరెప్పుడిక్కడికి వచ్చితిరి? ఈరక్కసుఁ డెవ్వఁడు అని యడిగిన వారు, అన్నా! మనవృత్తాంతము చాలగలదు. ఆనక జెప్పుకొందముగాక .అదిగో నీగుఱ్ఱము అందున్నది ఎక్కుము. ఇక్కడికి మనము ధన్యులమే!! అని పలికిన విని సంతసించుచుఁ గళాభిరాముఁ డాగుఱ్ఱమెక్కి వారితోఁగూడ నగరమువీధులఁ దిరుగఁజొచ్చెను. పౌరులు రాక్షసభయంబునఁ దలుపులుమూసి తీయకుండిన వీరునలువురు నాలుగువీధులకుంబోయి.