పుట:Kaashii-Majilee-Kathalu-V10.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపూర్ణముగా జదివినంగాని యిందలి చమత్కారము తెల్లముకాదు. కాశీమజిలీకథలు పదవభాగముతో ముగింతునని యిదివఱకుఁ దెలిపియుంటిని మజిలీలు పూర్తికాకపోవుటయు మంచికథలు మిగిలియుండుటయు, మణిసిద్ధయతి శిష్యునితోఁ గాశీనగరము జేరక పోవుటయు లోనగు కారణములంబట్టిపండ్రెండవభాగము పఱకు వ్రాసినంగాని సమాప్తినొందింపఁ వీలుపడినది కాదు. సాధ్యమైనంత త్వరలో 11-12 భాగము లొకసారియే ప్రకటింతునని మా చదువరులకు విన్నవించుచున్నాను. రెండు సంవత్సరములనుండి మాచదువరులీభాగమునకు వ్రాయులేఖలకు మేఱలేదు.

మా చదువరు లందఱకు నీకథలయం దాదరము కలిగియున్నదని వారు వారు వ్రాయునట్టి లేఖలవలన దెల్లమగుచున్నది. వీనిపై నిచ్చిన పండితాభిప్రాయముల 12వ భాగమునఁ బ్రకటింపగలవాఁడ.

కథలన నెట్టిపామరులకైన నానందము గలుగకమానదు. శర్కరయని చెప్పి పిల్లలకు మందు ద్రావించినట్లు కథలనిచెప్పి జన్మతారకములైన మహాపురుషుల చరిత్రములు లోకులకు విన్నవించుట యే నాయుద్దేశమని పండితులు గ్రహింతురుగాక. ఇందు నలుపది మజిలీల కథలు గలిగియున్నవి. దేశసాంప్రాదాయములు నారీ సంకేతకములు లోనగు విశేషము లిందు వ్రాయ బడియున్నవి

నారదమహర్షి చరిత్రాంశములు పురాణములో బలువిధములగావ్రాయఁబడియున్నవి, నారదుండు బ్రహ్మదేవుని తొడనుండి యుదయించెనని భారతాది గ్రంధములు, కంఠమునుండిఁ బొడమెనని బహ్మవైవర్తపురాణము చెప్పుచున్నవి. పరస్పరభేదముల సవరించి నాచే నీకథలు వాయఁబడినవి కావున నిందలి తప్పులు మన్నించి యొప్పుల గ్రహింతురని విద్వాంసులఁ బ్రార్థించుచున్నాను,

ఇట్లు

మధిర సుబ్బన్న దీక్షితకవి

20 - 6 - 26

రాజమండ్రి