పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

వివిధములైన వస్తుసముదాయము నొకచోట చేర్చి వాటిని తగురీతిలో పరిశోధించుటకు, చూచి ఆనందించుటకు ఏర్పాటైన ప్రదేశమును వస్తుప్రదర్శనశాల (మ్యూజియం)[1] అని పిలుతురు. ఈ వివిధ వస్తువులు ఒకే ప్రదేశమునకుగాని, వివిధ ప్రదేశములకుగాని చెందియుండవచ్చును. అటులనే ఆ వస్తు సముదాయము ఒకే నాగరికతకుగాని, విభిన్న నాగరికతలకు, అనేక శతాబ్దములకు చెందినవై కూడ ఉండవచ్చును. కాని మన మేర్పాటు చేయు మ్యూజియం యొక్క ముఖ్యోద్దేశమును బట్టి వస్తుసేకరణ జరుగుట సమంజసము. పెద్ద మ్యూజియంలు, అనగా రాష్ట్రస్థాయికి, దేశస్థాయికి చెందినటువంటివి, వివిధ రకములైన వస్తువులు, వివిధ నాగరికతలకు, అనేక శతాబ్దములకు చెందినవాటిని సమకూర్చుకొనవచ్చును. కాని కొలనుపాక మ్యూజియంవంటి ప్రాదేశిక లేక స్థానిక మ్యూజియంలు (Site Museums), ఆ ప్రదేశమునకు, లేక కొంత చుట్టు ప్రక్కల ప్రదేశములకు చెందిన వస్తువులను సేకరించి భద్రపరచి ప్రజాబాహుళ్యమునకు అర్థమగు రీతిలో చూపించుటకు ప్రయత్నించుట సమంజసము. కొలనుపాక గ్రామానికి చుట్టుప్రక్కల ఇప్పటికినీ అనేక పురావస్తు శిధిలావశేషములు మనకు కనిపించుచున్నవి. అట్టివానిలో సేకరించిన అనేక శిలావిగ్రహములు, శాసనముల నొకచోట చేర్చి మ్యూజియంగా నేర్పాటుచేయబడినది.

చారిత్రక యుగమునుండీ కొలనుపాక ప్రఖ్యాతిలోనికి వచ్చినదనుటకు దృష్టాంతములు కలవు. జైన మతానుయాయులకు కొలనుపాక ఒక పవిత్ర యాత్రాస్థలము. ప్రస్తుత మిచ్చట శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైనదేవాలయము నిత్య పూజారాధనలతో విలసిల్లుచున్నది. దీనిని దర్శించుటకు దేశపు నలుమూలలనుంచీ యాత్రికులు ఇప్పటికిని ప్రతినిత్యమూ వచ్చుచున్నారు. ఇదిగాక ఇచ్చట అనేక శైవమఠములు ఇతర దేవాలయములు కలవు. అందు సోమేశ్వరస్వామి వారి ఆలయ మొకటి. చాళుక్య, కాకతీయ వంశములు ఇచ్చట తమ ప్రాబల్యమును చూపినవి. ఆ కాలమునాటి శిల్పములు, శాసనములు, ఈ గ్రామము చుట్టుపట్ల దొరకినవి. ఆ తరువాతి కాలమునకు చెందిన శిల్పములు కూడ ఇచ్చట దొరకినవి. వీటినన్నింటిని చేర్చి ఈ మ్యూజియంను ఏర్పచిరి.

  1. ప్రదర్శనశాల అను పదముకన్నా 'మ్యూజియం' అను పదము ప్రజాబాహుళ్యమునకు తేలికగా అర్థమగును గాన 'మ్యూజియం' అను పదమునే ఇక మీద వాడుదును.