పుట:KOLANAUPAKA PURAVASTHU PRADARSHANA SHALA.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొలనుపాక - చారిత్రక ప్రాముఖ్యత

కొలనుపాక గ్రామము నల్లగొండ జిల్లాలోని ఆలేరునకు సుమారు 6 కి.మీ. దూరములో నున్నది. ఆలేరు, సికింద్రాబాద్ - విజయవాడ రైలుమార్గములో సికింద్రాబాద్‌నకు 60 కి.మీ. దూరములో నున్నది. ఆలేరు నుండి రాష్ట్ర రవాణా శాఖ బస్సులు, మరి అనేక యితర సాధనముల ద్వారా కొలనుపాక చేరవచ్చును.

ఈ గ్రామనామము అనేక రూపాంతరముల చెందినటుల చరిత్ర పరిశోధనల వల్ల తెలియుచున్నది. తాడిమలింగ్ - నరిసిపూర్ తాలూకా మైసూరు నందు దొరికిన రాజేంద్ర చోళుని ఒక శాసనములో ఈ గ్రామమును కొల్లిపాకై అని పేర్కొనబడెను.[1] ఇది రాజేంద్ర చోళుని పదయవ రాజ్యపాలనా సంబ్వత్సరమున యియ్యబడ్డ శాసనము. సోమేశ్వర స్వామి వారి దేవాలయ సమీపమున కల వాగులో ఇసుక మేటయందు దొరికిన, ప్రస్తుత రాష్ట్ర ప్రదర్శనశాల, హైదరాబాద్ నందు భద్రపరచబడిన మూడు పంచ లోహ గంటలలో ఒక దానిమీద కల శాసనము ఈ విధముగా తెలుపుచున్నది.[2]

స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టిపూజ కనుక ఇచ్చట కూడ కొల్లిపాకేయ యను రూపాతమునే వాడినారు. పశ్చిమ చాళుక్య వంశపు రాజులు జగదేక మల్లుడు, త్త్రైలోక్యమల్లుని యొక్క శాసనము గూడా ఇదే రూపాంతరమును తెలుపుచున్నవి.[3] కొల్లిపాకేయ యనుమాట కొల్లిపాక కు కన్నడ భాషాంతరీకరణము. కాకతీయ రుద్ర దేవుని మొరిపరాల తెలుగు శాసనములో కొల్లిపాక యని మాత్రమే వాడబడి యున్నది.[4] విజయనగర రాజైన సదాశివ రాయల కాలమునాటికి ఈ నామము రూపాంతరము చెంది కొల్ పాక్ గా మారి ప్రస్తుతము కూల్ పాక్ లేక కొలను పాక యని పిలువబడుచున్నది.[5]

  1. ఎఫిగ్రాయా కర్ణాటికా: వాల్యూం III : పుట 34.
  2. లలితకళా వాల్యూం నంబరు 10: పుటలు 25 - 30.
  3. ఎపిగ్రాఫియా ఇండికా: వల్యూం నంబరు: III, పుట 230. ఎపిగ్రాఫియా ఇండికా : వాల్యూం నంబరు IV : పుట 323.
  4. హైదారాబాద్ ఆర్కలాజికల్ సీరీస్ నంబరు. 19. పుట 147.
  5. ఎఫ్. కీల్ హారన్: బ్రిటిష్ మ్యూజియం ప్లేట్స్ ఆఫ్ సదాశివరాయ: శక సంవత్ 1478. ఎపిగ్రాఫికా ఇండికా: వాల్యూం IV. పుట 22.