పుట:Jyothishya shastramu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పటికి మొత్తము ఆరు స్థానములలో కర్మ వ్రాతను తెలుసుకోగలి గాము. ఇక మిగిలిన స్థానములు ఆరు కలవు. ఎదురెదురుగాయున్న 5,11 స్థానములను గురించి తెలుసుకొందాము. స్థూల స్థిరాస్తులైన గృహము, భూములు మొదలగునవి ఏ మనిషికి ఏమి ఉన్నవో కర్మచక్రము లోని నాల్గవ స్థానమును చూచి తెలియవచ్చును. నాల్గవ స్థానమునకు క్రింద పైన ఇరువైపుల 3వ స్థానమూ, 5వ స్థానమూ కలవు. నాల్గవస్థానము కేంద్రస్థానమైన దానివలన దానికిరువైపులనున్నవి నాల్గవస్థానమును అనుసరించియుండును. అంగీ భాగమునకు కేంద్రమైన నాల్గవ స్థానములో స్థూల ఆస్తుల కర్మలుండగా దాని తర్వాతగల ఐదవ స్థానములో స్థూల ఆస్తులు సంపాదించుటకు తగిన బుద్ధిని సూచించు కర్మలుండును. ఒక మనిషి ప్రపంచములో స్థూల ఆస్తులు సంపాదించుటకు కావలసిన ప్రపంచ బుద్ధి, ప్రపంచ జ్ఞానము (ప్రపంచ విద్య) ఐదవ స్థానములో లిఖించబడి యుండును. నాల్గవ కేంద్రస్థానములో స్థూల ఆస్తుల కర్మలుండగా దానిని ఆధారము చేసుకొని ఐదవ స్థానములో ప్రపంచ జ్ఞానముండగా, మూడవ స్థానములో ప్రపంచ ధనమునకు సంబంధించిన కర్మ ఉండును. ప్రపంచ ధనము అనగా డబ్బు నిలువ, డబ్బు చలామణి అని అర్థము. దీనినంతటినీ గ్రహించితే అంగీ భాగమందు వరుసగాగల 3,4,5 స్థానములలో ప్రపంచ ధనము, ప్రపంచ ఆస్తి, ప్రపంచ జ్ఞానము వరుసగా అన్నీ ప్రపంచ సంబంధ విషయ కర్మలేగలవు. అంగీలో కేంద్రమైన నాల్గవ స్థానమును ఆధారము చేసుకొని మూడులో ప్రపంచ ధనమునకు సంబంధించిన కర్మ, ఐదులో ప్రపంచ సంబంధ జ్ఞానము లేక చదువుల కర్మలున్నాయని తెలుసుకొన్నాము కదా! వాటినే క్రింద 44వ చిత్రపటములో చూడవచ్చును. కర్మ చిత్రపటములోనున్న పన్నెండు భాగములలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క రకమైన కర్మతో నిండిపోతుండడము చిత్రపటములో చూడవచ్చును.