పుట:Jyothishya shastramu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. కర్మచక్రములో కేంద్రములు

కర్మచక్రములోని 12 భాగములను అంగీ అర్థాంగీ అని రెండు భాగములుగా విభజించుకొన్నాము. అంగీ అను మొదటి భాగములో 1వ స్థానమూ, అర్థాంగి అను రెండవ భాగములో 7వ స్థానము ప్రారంభమైనవి అగుటయేకాక, 1వ స్థానములో తన శరీరమునకు సంబంధించిన కర్మయూ, 7వ స్థానమున తన భార్యకు సంబంధించిన కర్మయూ నమోదు చేయబడిన దనీ మరియు నమోదు చేయబడుచున్నదనీ చెప్పాము. ఇప్పుడు అంగీ అర్ధాంగి అను రెండు భాగములలో ముఖ్యకేంద్రములుగా గుర్తింపబడిన స్థానములు రెండు గలవు. మొదటి భాగమున ఆరు స్థానములలో ముఖ్యమైనదిగా ఒక స్థానమూ, రెండవ భాగమున ఆరు స్థానములలో ముఖ్యమైనదిగా మరియొక స్థానమును గుర్తించడమైనది. ఈ రెండు ముఖ్య స్థానములు అంగీ, అర్ధాంగీ అను రెండు భాగములలో ఆయా భాగములకు కేంద్రములుగా గలవు. కేంద్రము అనగా ఆధారస్థానమనీ, ముఖ్యముగా గుర్తింపు పొందిన స్థానమనీ చెప్పవచ్చును. కర్మచక్రము యొక్క పన్నెండు స్థానములలోనే మనిషి (జీవుని) జీవితమంతా ఇమిడియున్నది. మనిషి జీవితమునకు సంబంధించి కర్మచక్రములో కేంద్రములుగాయున్న స్థానము లేవియని గమనించిన ఇలా తెలియుచున్నది. కర్మపత్రములో శరీరమూ, పుట్టుక ప్రారంభమునకు సంబంధించి ఒకటవ స్థానముండగా, అక్కడినుండి మొత్తము ఆరు స్థానములను అంగీ భాగము అనియూ, తర్వాత ఆరు స్థానములను అర్థాంగి భాగమనియూ చెప్పుకొన్నాము కదా! ఇప్పుడు అంగీ భాగములోని ఆరు స్థానములలో ఒకటవ స్థానమును వదలి మిగత ఐదు స్థానములను తీసుకొని వాటిలో మధ్యలో గల దానిని గమనించితే వరుసలో నాల్గవ స్థానము మద్యదగును. ఒకటవ స్థానము తర్వాత రెండు, మూడు స్థానములకూ, ఐదు, ఆరు స్థానములకూ మధ్యలో నాల్గవ స్థానము కలదు.