పుట:Jyothishya shastramu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మపత్రాన్ని మెడలో వ్రేలాడదీశామని చెప్పారు. ఈ విధముగా కర్మచక్రము ఆధ్యాత్మిక రంగములో అన్ని మత గ్రంథములందు ప్రస్తావనకు వచ్చినది.

ప్రతి మనిషికీ కాల, కర్మ, గుణచక్రములు మూడు ముఖ్యమైనవని చెప్పుకొన్నాము. ఆ మూడు చక్రములలో కర్మచక్రము చాలా ముఖ్యమైనదని చెప్పాము. కర్మనుబట్టియే కాలమూ, కర్మనుబట్టియే గుణములని కూడా చెప్పుకొన్నాము. ఇప్పుడు మరికొంత ప్రత్యేకముగా చెప్పునదేమనగా! సృష్ఠ్యాది నుండియున్న కాలచక్రములోని గ్రహములుగానీ, గుణచక్రములోని గుణములు గానీ, మారకుండా ఎన్నియున్నవో ఎలాయున్నవో, అన్నియు అలాగేయున్నవి. కాలచక్రములోని పన్నెండు (12) గ్రహములు మారలేదు. గుణచక్రములోని గుణములు మారలేదు. నిమ్మకాయలోని పులుపు, మిరపకాయలోని కారము కొంత మారవచ్చునేమోగానీ, కాలచక్రము లోని గ్రహములుగానీ, గుణచక్రములోని గుణములుగానీ ఏమాత్రము కొంతయినా మార్పుచెందకుండా అలాగేయున్నవి. కాలచక్రములోని గ్రహములు, గుణచక్రములోని గుణములు మారకున్నా, కర్మచక్రములోని కర్మ మాత్రము నిత్యము జమ, ఖర్చు అగుచు ఎల్లప్పుడూ మారుచునే ఉన్నది. ఎవరి కర్మచక్రములోని కర్మ స్థిరస్థాయిగా ఉండదు. అందువలన ఎప్పటికీ ఒకేలాగున ఆగామి పాపపుణ్యములుగానీ, ప్రారబ్ధ పాపపుణ్యములు గానీ ఉండక మారుచుండును. నిత్యమూ మారుచున్న కర్మచక్రము మూడు చక్రములలో ముఖ్యమైనదై ఉన్నది. ఎవడు ఎటువంటివాడో చూడవలసివచ్చి నప్పుడు వాని గుణములను ప్రేరేపించు కర్మనే చూడవలసివచ్చుచున్నది. కర్మ ప్రేరణవలననే గుణములు ఉండుట వలన గుణములకు కారణమైన కర్మనే చూడవలసివచ్చినది. అందువలన మనిషికి సంబంధించిన జీవన విధానమేదైనా ఎట్లున్నదనుటకు కర్మయే అద్దముగా, ప్రతిరూపముగా