పుట:Jyothishya shastramu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. 12 గ్రహములు ఏవి?

గుణములు 12 రకములు గలవు. 12 గుణములలో వచ్చు కర్మలు 12 రకములు గలవు. 12 గుణములలో పుట్టు 12 రకముల కర్మలను గ్రహించు గ్రహములు కూడ 12 గలవు. గ్రహములు నివశించు కాలచక్రము కూడా 12 భాగములుగా ఉన్నది. కర్మచక్రము కూడ 12 రకముల కర్మలు నిలువయుండుటకు 12 భాగములుగానే ఉన్నది. కాలచక్రములోని 12 భాగములలో స్వంత స్థానములను ఏర్పరచుకొన్న 12 గ్రహముల పేర్లు వరుసగా ఈ విధముగా కలవు. 1) రవి 2) చంద్రుడు 3) కుజుడు 4) బుధుడు 5) గురువు 6) శుక్రుడు 7) శని 8) రాహువు 9) కేతువు 10) భూమి 11) మిత్ర 12) చిత్ర. సూర్యకుటుంబములోని గ్రహములలో భూమి కూడ కలదు. కావున దానిని అందరు ఒప్పుకొనుటకు అవకాశము గలదు. కానీ ఎవరూ ఇంతవరకు విననివి మరియు తెలియనివి అయిన మిత్ర, చిత్ర అను రెండు గ్రహములు కూడా కలవు. ఇంతవరకు ఖగోళశాస్త్ర పరిశోధకులకు కూడ ఈ రెండు గ్రహముల ఉనికి తెలియదు. ఖగోళ శాస్త్రపరిశోధకులు భవిష్యత్తులో ఈ రెండు గ్రహములను గూర్చి చెప్పవచ్చునేమో కానీ, ఇప్పటి వరకు వాటి వివరము ఏమాత్రము వారికి తెలియదు. ఈ రెండు గ్రహములను కనుగొనుట కొంత కష్టముతో కూడుకొన్న పనియేనని చెప్పవచ్చును. ఇక్కడ కొందరు మేధావులు మమ్ములను ఈ విధముగా ప్రశ్నించవచ్చును. ఇంతవరకు ఖగోళ శాస్త్రజ్ఞులకే తెలియని రెండు గ్రహముల వివరము మీకు ఏ పరిశోధన ద్వారా తెలిసినది? పైగా ఈ రెండు గ్రహములను కనుగొనుట కష్టముతో కూడుకొన్న పనియే అన్నారు. ఆ విషయమును మీరెలా చెప్పుచున్నారని అడుగవచ్చును. దానికి మా జవాబు ఈ విధముగా కలదు.