పుట:Jyothishya shastramu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎవరూ దానిని గుర్తించలేరు. ఏ పరికరముల ద్వారానైనా, ఏ రేడియేషన్‌ కిరణముల ద్వారా అయినా గుర్తింపబడని గ్రహము మిత్రగ్రహము. నేడు ముహమ్మద్‌ప్రవక్తగారి పేరు శాశ్వతముగా మనుషుల మధ్యలో ఉండుటకు కారణము మిత్రగ్రహమేనని చెప్పవచ్చును. రాహువు విగ్రహారాధన భక్తిని కల్గించువాడైయుండగా, కేతువు నిరాకార భక్తిని కల్గించునదై ఉన్నది. బాగా జ్ఞాపకముంచుకోండి మేము చెప్పునది నిరాకారభక్తినిగానీ, నిరాకార జ్ఞానమును కాదు. జ్ఞానము ఎప్పటికీ గ్రహముల ఆధీనములో ఉండదు. రాహువుది భక్తియే రాహువుకి వ్యతిరేఖమైన కేతువుదీ భక్తియే. రాహువుది సాకారభక్తియైతే, కేతువుది నిరాకార భక్తియని గుర్తుంచుకోవలెను. కేతువు పదవస్థానమున ఉండుట వలన, అతని జీవిత వృత్తి, ప్రవృత్తి రెండూ నిరాకార భక్తిమీద సాగునట్లు చేసినది. నిరాకార భక్తిలోనున్న ప్రార్థన వారి జీవితములో ఉండేది. నిరాకార ప్రార్థన అయిన నమాజ్‌ నేడు ముస్లీమ్‌ సమాజములో పూర్తిగాయున్నది. ప్రవక్తగారు స్థాపించిన ప్రార్థన నేటికీ చెక్కుచెదరకుండ ముస్లీమ్‌లలో పాతుకొని పోవునట్లు చేసినది మిత్రగ్రహము. నిరాకార భక్తిని కల్గించినది కేతు గ్రహముకాగా, దానినే ప్రవక్తగారి కీర్తికి ఆధారముగా అందరిలో నిలిపినది మిత్రగ్రహము. సాకార భక్తిలో హిందువులు మరికొందరు మునిగిపోయి సాకారభక్తికి కేంద్రములుగా దేవాలయములను నిర్మించుకోగా, ప్రవక్తగారు దానికి భిన్నముగా ముస్లీమ్‌ సమాజమును తయారు చేసి నిరాకారభక్తిని వారియందుంచి, నిరాకార భక్తికి కేంద్రములుగా ప్రార్థనామందిరములైన మసీద్‌లను నిర్మించాడు. ఆనాడు ప్రవక్తగారు ప్రత్యేక సమాజమును (నిరాకారభక్తి సమాజమును) స్థాపించుటకు కారణము కేతు గ్రహముకాగా, ఆయన కీర్తిని ఎల్లకాలము ఉండునట్లు మిత్రగ్రహము ముస్లీమ్‌ సమాజము మొత్తము ప్రవక్తగారినీ,