పుట:Jyothishya shastramu.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29) ఒక వ్యక్తికి నాగుపాముకరచినప్పుడు ఒక వైద్యునివద్దకు తీసుకు పోయి వైద్యము చేయించాము. అతడు విషమునుండి బయటపడి బ్రతక గలిగాడు. తర్వాత పది దినములకు మరియొక వ్యక్తి నాగుపాము కాటుకే గురిjైునాడు. అప్పుడు అతనిని వైద్యునివద్దకు తీసుకుపోవడము జరిగినది. వైద్యుడు అందరికీ చేసినట్లే శ్రద్ధగా వైద్యము చేశాడు. అయినా పాము కాటుకు గురియైన మనిషి బ్రతుకలేదు. ఒకే వైద్యుడు, అదే వైద్యము ఒకరికి బాగుకావడము మరియొకరికి బాగుకాకుండ పోవడమునకు కారణమేమి ఉండును. దీనికి కూడా గ్రహచారముండునా?

జ॥ ప్రపంచములో ప్రతిదానికీ గ్రహచారమే కారణము. గ్రహచారము లేకుండా ఏమీ జరుగదు. ప్రపంచములో పాములకు, వాటి విషమునకు అధిపతి రాహుగ్రహము. రాహుగ్రహము వ్యతిరేఖమున్నవానికి ఉన్న స్థానమునుబట్టి గ్రహబలమునుబట్టి పాము కరుచుట సంభవించును. రాహువున్న చోట శుభగ్రహములు రెండుయున్నా ఒకటియున్నా అతడు వైద్యముతో బ్రతుకగలడు. రాహుగ్రహము ఆయుస్థానమైన ఎనిమిదవ స్థానమున ఉన్నా, రాహుగ్రహముతోపాటు ఆయు కారకుడైన శనికూడ ఉంటే అటువంటివాడు కాటు తర్వాత బ్రతుకుట కష్టము. రాహుగ్రహము కొందరికి అనుకూలగ్రహమైయుండుట వలన పాములు వారిని ఏమీ అనవు, కాటువేయను పూనుకోవు. రాహువు అనుకూలముగాయున్నవాని ఇంటిచుట్టూ పాముల సంచారమున్నా వాటివలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దోమలు, చీమలు, క్రిమికీటకాదులు, సర్పములు అన్నియు రాహువు యొక్క ఆధీనములో ఉండును. రాహువు అనుకూలము లేకపోతే ఇంటిలో చీమలతో కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇదంతయు గ్రహచారమునుబట్టియే జరుగుచుండును.