పుట:Jyothishya shastramu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనిపించవు. ప్రపంచములో ఏ మనిషీ ఈ మూడునూ చూడలేడు. అయితే ఇప్పుడు కొందరు తెలివిగా నన్ను ఒక ప్రశ్నను అడుగవచ్చును. అదేమనగా! ‘‘మీరు వ్రాసిన గ్రంథములలో ఇది కాలచక్రమని, దానిక్రింద ఇది కర్మ చక్రమనీ, దానిక్రింద గుణచక్రమని బొమ్మవేసి చూపి అందులో జీవుడిట్లున్నాడనీ, గుణములు ఇట్లున్నవనీ బొమ్మతో సహా చూపారు. ఏ మనిషీ చూడలేదని చెప్పిన మీరే ఆ బొమ్మలను చూపారు కదా! గుణచక్రము అందులోని మూడు భాగములు ఎట్లుండునో తెలియని మాకు గుణభాగము లనూ జీవుని ఆకారమునూ చూపారు కదా!’’ అని అడుగవచ్చును. దానికి మా జవాబు ఇలాయున్నది చూడండి. ప్రపంచములో ఏ మనిషీ చూడలేదు అనేమాట బ్రహ్మవిద్యా శాస్త్రములోని శాసనము. ఆ శాసనము ఎప్పటికీ మారదు, అసత్యమూ కాదు. అయితే మీరెలా చెప్పారు అని మీరు అడిగినది హేతుబద్ధమే అయినా దానికి నేను కూడా హేతుబద్ధముగానే సమాధానము ఇస్తున్నాను. అక్కడ వాక్యములో ఏ మనిషీ చూడలేదు అన్నమాటను చూచిన తర్వాత మీకు మరొక జ్ఞప్తి కూడా రావలసింది. జనన మరణ సిద్ధాంతమును చెప్పినప్పుడు ఈ విషయము ప్రపంచములో పుట్టినవానికి ఎవనికీ తెలియదని చెప్పినప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్న అప్పుడే అడుగవలసింది. అయినా ఫరవాలేదు. ఇప్పుడు అడిగారు కాబట్టి సంతోషిద్దాము. జనన మరణ సిద్ధాంతములోని విషయముగానీ, ఇప్పుడు చెప్పిన కాలము, కర్మము చెప్పిన విషయముగానీ ఏ మనిషికీ తెలియదు అని చెప్పినప్పుడు ఇది ఒక మనిషి చెప్పిన విషయమని మీరెలా అనుకుంటు న్నారు? మీకు కనిపించేది మనిషే అయినా నేను చెప్పినట్లు అనుకోవడము మీ పొరపాటు. నేను ఎన్నోమార్లు చెప్పాను. ఇప్పుడు కూడా గుర్తు చేయుచున్నాను. నాకు ఏమీ తెలియదు. అందువలన ఎవరికీ తెలియదని