పుట:Jyothishya shastramu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రారబ్ధ కర్మతోపాటు నిర్ణయించబడియుండును. మధ్యలో ఎవరూ నిర్ణయించ లేరు. నిర్ణయించినా దానిని ముహూర్తమనరు.

5) కొందరు తమ పిల్లలు పుట్టిన సమయములోనున్న నక్షత్రమునుబట్టి పేరు పెట్టుచుందురు. కొందరు ఏమీ చూడకనే పేర్లు పెట్టుచుందురు. అట్లు పెట్టు పేర్లలో బలముండునా? ఎలా పేరు పెట్టడము మంచిది?

జ॥ పుట్టిన సమయములో ఉన్న నక్షత్రమునుబట్ట్టి, ఆ నక్షత్రము యొక్క నాలుగు పాదములకు గుర్తుగా నిర్ణయించబడిన నాలుగు అక్షరములలో అప్పటి పాదమునకు సంబంధించిన అక్షరమును మొదటి అక్షరముగా ఉండునట్లు చేసి పేరును పెట్టుకోవడము జరుగుచున్నది. అలా పుట్టిన సమయములోనున్న నక్షత్రమునకు సంబంధిత అక్షరముతో పేరు పెట్టుకొనినా, అలా పెట్టుకొనక వేరే పేరును పెట్టుకొనినా, అందులో లాభముగానీ నష్టముగానీ ఏమీ ఉండదు. కొన్ని పేర్లు పలికే దానికి సులభముగా అందముగా ఉండవచ్చును. కొన్ని పేర్లు కష్టముగా అందహీనముగా మొరటుగాయుండును. అయితే వాటిలో బలముండడము గానీ, ఉండకపోవడముగానీ ఏమీ ఉండదు. ఏ మనిషికీ ఏ పేరువలనా ఎటువంటి బలాబలములుగానీ, లాభనష్టములుగానీ ఉండవు.

6) ఒకరి జీవితములో ఒకపెళ్ళిమాత్రము జరుగగా, మరొకరి జీవితములో రెండు పెళ్ళిళ్ళు జరుగుచుండుట చూశాము. దానికి కారణము ఏమి?

జ॥ ఒక వ్యక్తి జాతకములో ఏడవస్థానము కళత్ర స్థానమనబడును. కళత్ర స్థానమనగా భర్తకు భార్య కళత్రమగును. అట్లే భార్యకు భర్త కళత్రమగును. కళత్రస్థానమైన ఏడవ స్థానమున రాహువుగానీ లేక