పుట:Jyothishya shastramu.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఇంతవరకు పన్నెండు గ్రహముల దశలను చెప్పుకొన్నాము. పన్నెండు గ్రహముల దశలన్నిటిని కలిపితే మొత్తము 120 సంవత్సరములు అగుచున్నవి. ఒక మనిషి యొక్క సంపూర్ణ ఆయుష్షు 120 సంవత్సరములని పూర్వము పెద్దలు దీనినిబట్టే చెప్పెడివారు. ఇక్కడ పూర్తి వివరము కొరకు పన్నెండు దశలను వ్రాసి చూపించాము. కానీ ప్రతి మనిషి 120 సంవత్సరములు బ్రతుకడని అందరికీ తెలుసు. 120 సంవత్సరములు బ్రతుకకూడదను నియమము ఏమీ లేదు. కావున 120 సంవత్సరములు బ్రతికేవారు కూడా యున్నారు. స్థూల శరీరములతో ఎవరూ బ్రతికిలేకున్నా సూక్ష్మముగా, సూక్ష్మ శరీరముతో ఎందరో 120 సంవత్సరములకంటే ఎక్కువ బ్రతుకుచున్నవారు కూడా కలరు. ఇక్కడ పన్నెండు దశలను వ్రాసినంత మాత్రమున ఈ జాతకుడు కూడా 100 సంవత్సరముల పైన బ్రతుకునని కూడా చెప్పలేము.