పుట:Jyothishya shastramu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాదములో ఉన్నట్లు తెలిసినది. జాతకుడు పుట్టిన సమయములో సూర్యుడు ఎక్కడున్నాడని తెలియుటకు గత పేజీలలో చెప్పుకొన్నాము. సూర్యోదయము మొదలు జాతకుడు పుట్టిన సమయము వరకు లెక్కించి సూర్యున్ని తెలియ గలిగి అతడున్న లగ్న కిరణములనుబట్టి జాతకుని జన్మ లగ్నమును తెలియ గల్గుచున్నాము. గ్రహచార విధానములో జన్మ లగ్నము ఎంత ప్రాధాన్యత కల్గియున్నదో, అలాగే గ్రహచార విధానములో చంద్రుని ద్వారా తెలియ బడు ప్రారంభ దశ ఏదో తెలియడము కూడా ముఖ్యమైనదే. ప్రారంభం దశను తెలియగలిగితే దానికి అనుబంధముగాయున్న దశలను వరుసగా తెలియగలము. ప్రస్తుత జన్మలో ఏ దశ, ఎక్కడి నుండి ప్రారంభమగుచున్నదో తెలియగల్గితే గతజన్మలో చనిపోయినది ఫలానా దశలో ఫలాన కాలములో అని చెప్పవచ్చును. ఇక్కడ కొందరికి అనుమానము రావచ్చును. ఈ జన్మలోనిదే సరిగా తెలియలేకున్నాము. అటువంటప్పుడు గతజన్మలోని మరణ విషయమును తెలియవచ్చుననుమాట ఎంతవరకు సత్యమని అడుగ వచ్చును. దానికి మేము చెప్పునదేమనగా! ఒక ప్రయాణికుడు కాలినడకన దూరప్రయాణము చేయుచూ మధ్యలో చిన్న ఊర్లను అక్కడక్కడ పెద్దఊర్లను దాటుచూ పోవుచున్నాడనుకొనుము. అతడు పగలంతా ప్రయాణము చేసి రాత్రిపూట ఒకచోట ఆగి ఉదయము తిరిగి అక్కడినుండి బయలుదేరి పోయెడివాడు. వాని విషయములో వాడు రాత్రి ఎక్కడైతే ఆగాడో, తిరిగి ఉదయము అక్కడినుండే బయలుదేరునని చెప్పడములో సత్యమున్నట్లే, ఒక వ్యక్తి పొడవాటి జీవిత ప్రయాణములో రాత్రివలెనున్న మరణము వచ్చినప్పుడు ఏ సమయములో చనిపోయాడో వాడు తిరిగి అదే సమయము లోనే జన్మించి తన జీవిత ప్రయాణమును సాగించుచున్నాడని చెప్పడము సత్యమేయగును. ఒకడు గతజన్మలో ఒక దశలో ఏ సంవత్సరము, ఏ