పుట:Jyothishya shastramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసిన పనికి దినకూలి రూపములోగానీ, నెలజీతమురూపములోగానీ తీసు కొంటున్నాము. ఇది కనిపించెడి ఫలితము. మనిషి చేయు ప్రతి పనికీ కనిపించని ఫలితము కూడా వచ్చుట గలదు. ఆ కనిపించని ఫలితమునే ‘కర్మ’ అంటాము. దానినే విడదీసి చెప్పుకొంటే, పాపము మరియు పుణ్యము అంటాము. ప్రతి మనిషీ భూమిమీద నిత్యము ఏదో ఒక పనిని చేస్తున్నాడు. కనిపించెడి ఫలితమునూ, కనిపించని ఫలితమునూ రెండిటినీ పొందు చున్నాడు. ఉదాహరణకు ఒక పోలీస్‌ ఉద్యోగి, తన ఉద్యోగరీత్యా పోలీస్‌స్టేషన్‌లో ఒక దొంగనో లేక నేరస్థుడినో కొట్టవలసి వచ్చినపుడు కొట్టక తప్పదు. దానిని ఉద్యోగ ధర్మము అంటారు. ఆ ఉద్యోగము చేసినందుకు ఫలితముగా, నెల జీతము తీసుకోవడము జరుగుచున్నది. ఉద్యోగము చేయడము కనిపించే పనియే. దానికి కనిపించే ఫలితమును డబ్బురూపములో జీతముగా తీసుకొంటున్నాడు. అయినా ఆ పోలీస్‌కు కనిపించని ఫలితమైన కర్మ, అతను తీసుకోకనే వెంటవచ్చుచున్నది. కనిపించే జీతము ఉద్యోగి తీసుకొని జేబులో పెట్టుకుంటే, కనిపించని కర్మ దానంతటదే వచ్చి, తలలోని కర్మచక్రమును చేరుచున్నది. కనిపించే జీతమును గ్రహించి తీసుకొని, పై జేబులో పెట్టుకోవాలా, క్రింది జేబులో పెట్టుకోవాలా అని ఆలోచించి మనము పెట్టుకొన్నట్లు, కాలచక్రములోని గ్రహములు కర్మను గ్రహించి, కర్మచక్రములోని ఏ భాగములో పెట్టాలో ఆ భాగములోనే పెట్టును. ఇట్లు మనిషికి తాను చేసిన పని యొక్క ఫలితము ప్రత్యక్షముగా ఉన్నట్లు, కార్యమునకు కర్మ పరోక్షముగా ఉన్నది. పనిలో కనిపించు డబ్బు వచ్చినట్లే, కనిపించని కర్మ కూడ వచ్చుచున్నదని ఎవరూ అనుకోవడము లేదు. ఆ కనిపించని కర్మ విధానము ఎవరికీ తెలియదు.