పుట:Jyothishya shastramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. కర్మంటే ఏమిటి?

‘కర్మ’ అను మాట చాలామంది నోట పలుకబడుచుండును. సాధారణ ప్రజలు, ఏమాత్రము జ్ఞానము తెలియనివారు కూడా అనేక సందర్భములలో కర్మయనీ, అది వాని కర్మయనీ, ఇది నాకర్మ అనీ తెలియకనే అంటున్నాము. అంతేకాక కర్మయని అంటూ చేయిని తన తలవైపు చూపడమూ, తలవ్రాతయని తలలోని ఫాలభాగమును చూపడమూ జరుగుచున్నది. ఇవన్నీ మనిషికి తెలియకనే మాట్లాడడము, చేయి చూపడము జరుగుచున్నదంటే, కర్మ అనునది ఒకటున్నదనీ, అది తలలో నుదుటి భాగములోనే ఉన్నదనీ అందరికి తెలియునట్లు, శరీరములోని ఆత్మే మనిషిని కదిలించి, మాట్లాడిరచుచున్నదనీ అర్థమగుచున్నది. కానీ మనిషి, కర్మ అని ఎందుకంటున్నాననిగానీ, తలవైపే చేయినెందుకు చూపుచున్నానని గానీ ఏమాత్రము అనుకోవడము లేదు. శరీరములోని ఆత్మ తెలిపినట్లు, కర్మచక్రము తలమధ్యలో ఉన్నదని తెలుసుకొన్నాము. కర్మచక్రములోని కర్మంటే ఏమిటో యోచించి చూద్దాము.

‘మర్మముగా ఉన్నది కర్మము’ అని పెద్దలంటుంటారు. ఎవరికీి తెలియకుండ మర్మముగా వచ్చి, మనిషిలో చేరునది కర్మ, కావున కర్మను మర్మము అన్నారు. కర్మను ‘చేసుకున్న ఫలితము’ అని కూడ అన్నారు. ఫలితమునకు ఉదాహరణ చెప్పుకుంటే, ఒక ఉద్యోగి చేయు పనికి ఫలితము జీతము రూపములో ఉండును. అట్లే ఒక కూలివాడు చేయు పనికి ఫలితము దినకూలి రూపములో ఉండును. ఈ విధముగ మనిషి చేయు ప్రతి పనికీ ఫలితముండును. మనిషి ఒక పని చేస్తే దానిలో వచ్చు ఫలితము రెండు రకములుగా ఉండును. ఒక రకము అందరికీ తెలిసినదే. దానిని డబ్బురూపములో గానీ, వస్తురూపములోగానీ, ధాన్యరూపములోగానీ,