పుట:Jyothishya shastramu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1994వ సంవత్సరము నాకు పరిచయమున్న వ్యక్తి యొక్క జాతకమును చూడడము జరిగినది. ఆ దినము ఆయన తన జాతకమును చూడమని నన్ను అడగలేదు. అయినా నేనే అడిగి ఆయన పుట్టిన దినమునూ, పుట్టిన సమయమునూ తెలుసుకొన్నాను. నేను ఏ విషయము లోనూ బయటపడను. ఆ రోజు నేనే ఎందుకు ఆయన పుట్టిన తేదీ (డేట్‌ ఆఫ్‌ బర్త్‌) అడిగానో నాకు తెలియదు. తర్వాత ఆ డేట్‌ ప్రకారము జాతకమును చూచి ఆయన జాతకము అంతా బాగుంది అని తెలుసు కొన్నాను. అయితే అతను ప్రమాదములో అకాల మరణము పొందునని తెలుసుకొన్నాను. నాకు పరిచయమున్న ఒక మంచి వ్యక్తి అలా చనిపోవునని తెలియడము బాధాకరమే, అయినా కర్మను ఏ ప్రపంచ శాంతులచేతగానీ, అనుభవించకుండా తప్పించుకొనుటకు వీలులేదు. భగవంతుడు చెప్పిన దానిప్రకారము ఎంతటి కర్మనైనా జ్ఞానమువలన దానినుండి తప్పించు కోవచ్చును. అయితే కర్మవున్న జాతకునికి జ్ఞానము ఉండాలి కదా! ఒకవేళ నేను ప్రమాదమును గురించి చెప్పినా ఆ వ్యక్తి నామాట వినునను నమ్మకము లేదు. అందువలన ఆ విషయమును అలాగే వదలివేశాము. ఆయన ప్రమాదమును గురించి నాకు పరిచయమున్న వారితో చెప్పడము జరిగినది. ప్రమాద విషయము జ్యోతిష్యశాస్త్రము ద్వారా తెలుసుకోగల్గినా, ఆ ప్రమాదము దేనివలన జరుగుతుందనిగానీ, ఖచ్ఛితముగా ఎప్పుడు జరుగు తుందనిగానీ, నాకు కూడా తెలియదు. పైగా జ్యోతిష్యము మీద నాకు కొంతవరకు నమ్మకమున్నా, నేను తెలుసుకొన్నది వాస్తవమేనా అని నాకే కొంత అనుమానముండేది. అయినా నాలో ఒకవైపు జ్యోతిష్యము అసత్యము కాదని అనిపించేది.