పుట:Jyothishya shastramu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాస్తవముగా నేను జ్యోతిష్యుడను కాను. అందువలన నేను ఎవరికీ జ్యోతిష్యమును చెప్పను. అలాగే కొంత వరకు వైద్యమును గురించి తెలిసినా నేను వైద్యుడను కాను వైద్యము చేయనుగానీ, ఆపదలోనున్న వారు వచ్చి అడిగితే వారికి సలహా చెప్పి పంపేవాడిని. రోగమును గురించి వివరించి చెప్పి మందును గురించి సలహా చెప్పేవాడిని మాత్రమే. ఎంతమందికి రోగాలు పోయాయి అనేది నాకు తెలియదుగానీ, నాకు సలహాజెప్పడము మాత్రమే తెలుసు. ఇక్కడ ముఖ్యముగా హిందూ సమాజమునకు సంబంధించిన జ్యోతిష్యము కొంతమంది చేత హేళన చేయబడుచుండడము వలన అటువంటి స్థితినుండి బయటపడుటకు, జ్యోతిష్యము యొక్క విలువ పది మందికి తెలియుటకు మేము ఈ జ్యోతిష్య గ్రంథమును వ్రాయాలను కొన్నాము, వ్రాశాము. జ్యోతిష్యము సత్యమా కాదా అని నేను పరిశోధించి సత్యమేనని తెలుసుకొన్న తర్వాత, అటు అనుభవములను నేను చూచిన తర్వాత ఇంతగొప్పగాయున్న దానిని గురించి కొంతయినా ఇతరులు తెలియుట మంచిదను భావముతో జ్యోతిష్యములోని క్రొత్త విషయములను గురించి చెప్పడము జరిగినది. జ్యోతిష్యము తెలుసుకొనుటకు మాత్రమేగానీ, రాబోవు దానిని తెలుసుకొని తప్పించుకొనుటకు గాదు. తెలుసుకొన్నంత మాత్రమున రాబోవు ఆపదను తప్పించుకొనుటకు వీలుపడదు. ఆపద జరుగకుండ ఉండుటకు శాంతులు చేయవచ్చునని కొందరంటుంటారు. అదంతయు కేవలము భ్రమ మాత్రమే. జాతకరీత్యా ఏమి జరుగవలెనని నిర్ణయించబడియుండునో అది జరిగితీరును. ప్రపంచ కార్యములతో ఏమి చేసినా జరిగేది జరుగక మానదు. కర్మనుండి తప్పించుకోవాలనుకొంటే ఒక జ్ఞానము తప్ప మరేదీ లేదు. జ్ఞానము వలన కర్మ కాలిపోవునని ముందే చెప్పుకొన్నాము. జ్ఞాన సంబంధములేనిది కర్మపోదు అనుటకు నా అనుభవములోని ఒక విషయమును చూస్తాము.