పుట:Jyothishya shastramu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46. జాతకుని జాఫతకము

ఇంతవరకు జ్యోతిష్యము ప్రకారము జాతకమును (జాఫతకమును) తెలుసుకొను నిమిత్తము కావలసిన సూత్రములన్నిటినీ వివరించుకొన్నాము. నేడు ఏ మనిషికైనా పుట్టిన తేదీ, పుట్టిన సమయమును ఇస్తే కంప్యూటర్‌లో ముందే సెట్‌ చేయబడిన జాతకము బయటపడును. పూర్వకాలము పుట్టిన దినమునకు సంబంధించిన ఆ సంవత్సర పంచాంగమును తీసుకొని చూచి దాని ద్వార జాతకమును తీసుకోవలసియుండెడిది. జన్మలగ్నము కొరకు, దశా సంవత్సరము కొరకు కొంత గణితమును ఉపయోగించి లెక్కాచారము ప్రకారము వ్రాసుకోవలసియుండెడిది. దానికొరకు జ్యోతిష్యులు 100 సంవత్సరముల వరకు పాత పంచాంగములను తమవద్ద దాచుకొనెడివారు. జాతక లగ్నములను వ్రాయుటకు వారము దినములు పట్టెడిది. నేడు అటువంటి అవసరము లేకుండ ఐదు నిమిషములలో జాతక లగ్నము లభించుచున్నది. ఇదంతయు సర్వసాధారణముగా నవగ్రహముల జాతకములే కంప్యూటర్‌లో లభించుచున్నవి. మేము ఈ గ్రంథములో పన్నెండు గ్రహములను చెప్పాము. కావున వాటిని అనుసంధానము చేసి మిగత సూత్రములను చెప్పవలసి వచ్చినది. ఇంతవరకు మేము చెప్పిన సూత్రములను ఉపయోగించి ఒక జాతకునికి జీవితమెట్లుండునో తెలియుటకు ఉదాహరణకు ఏదో ఒకరి జాతకమును తీసుకొని చెప్పాలి. ఎవరికీ తెలియని మనిషి యొక్క జాతకమును గురించి చెప్పితే అది నిజమెంతో అబద్దమెంతో తెలియదు. కొందరికి తెలిసిన వ్యక్తి జాతకమును గురించి చెప్పితే అందులో సత్యాసత్యములు కొన్ని అయినా తెలియునను ఉద్దేశ్యముతో చాలామందికి తెలిసిన ఒక వ్యక్తి జాతకమును గురించి వివరించదలుచుకొన్నాను.