పుట:Jyothishya shastramu.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిత్ర, చిత్ర, భూమి యొక్క గమనములు కాలచక్రములో ఎలా ఉన్నది మనకు తెలియాలి. పంచాంగము లేకున్నా ఆ మూడు గ్రహముల గమనములు తెలియుట చాలా సులభమైన పనియే. భూమి ఎల్లప్పుడు సూర్యునికి ఎదురుగా ప్రయాణిస్తూ సమానదూరముగ ఉన్నది. కాల చక్రములో సూర్యునిది ఎంత వేగమో భూమిది కూడా అంతే వేగము కలదు. కావున సూర్యుడు ఏ సమయములో లగ్నము మారుచున్నాడో అదే సమయములో భూమికూడా లగ్నము మారుచున్నది. పైన సూర్యుడు మిథున లగ్నమున మృగశిర 3వ పాదములో ప్రవేశించిన 4-19 నిమిషములకే భూమి ధనుర్‌ లగ్నమున మూల నక్షత్రము 1వ పాదమున ప్రవేశించినది. ఈ పద్ధతి శాశ్వతముగా ఉండునది కాబట్టి సూర్యుని విషయమును పంచాంగము ద్వారా తెలుసుకోగల్గి దానికి వ్యతిరేకముగా భూమి ఉన్నట్లు గుర్తించుకోవచ్చును. మిత్ర, చిత్ర విషయములో కూడా అలాగే చేయవచ్చును. రాహువు, కేతువు సమాన దూరములో సమాన వేగముతో ప్రయాణించుచున్నారు. వారిలాగే (రాహువు, కేతువులాగే) మిత్ర, చిత్ర సమాన దూరముతో, సమాన వేగముతో ప్రయాణించుచున్నారు. కనుక ఆ రెండు గ్రహములను కూడా సులభముగా గుర్తించవచ్చును. రాహువు క్రింది పాదములో చిత్ర, కేతువు క్రింది పాదములో మిత్ర గ్రహములు ఉన్నవి. అందువలన రాహువును ఆధారము చేసుకొని చిత్రను, కేతువును ఆధారము చేసుకొని మిత్ర గ్రహమును గుర్తించుకోవచ్చును. ఈ మూడు గ్రహములకు ప్రత్యేకించి పంచాంగములు ఇంతవరకూ లేవు. భవిష్యత్తులో పంచాంగకర్తలు ఈ గ్రహములను కూడా తమ పంచాంగములలో వ్రాసుకోవచ్చును. పంచాంగములలో సూర్యుడు, రాహువు, కేతువు గుర్తింపబడియుండుట వలన వారిని చూచి భూమి, చిత్ర, మిత్ర గ్రహము లను గుర్తించుకోవచ్చునని తెలుపుచున్నాము.