పుట:Jyothishya shastramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగములుగ గీచుకొన్నది కాలచక్రమని వారికి తెలియదు. దానిని లగ్నకుండలి అంటున్నారు తప్ప, అది తలలోని కాలచక్రమని తెలుసు కోలేకపోయారు. అంతేకాక తలలో కర్మచక్రమొకటున్నదనీ, దానికి ఒక ఆకారమున్నదనీ ఇప్పటి జ్యోతిష్యులకు తెలియదు. కర్మ అయిన పాపపుణ్యములను తెలియకుండ, కేవలము ప్రపంచ కష్ట సుఖములనూ, వస్తు వాహనములనూ, ధన కనకములనూ, స్థిర చరాస్తులను, పుత్ర, కళత్రముల ఫలితముల గురించి చెప్పుచున్నారు. వాటిని కూడ లగ్నకుండలి నుండియే చూస్తున్నారు. కర్మ చక్రమనునది ప్రత్యేకముగా ఉన్నదని వారికి తెలియదు. ఏ పండ్రెండు భాగములలో గ్రహములను చూస్తున్నారో, అదే లగ్నములలోనే ఫలితములను చూస్తున్నారు. దీనిని బట్టి కాల,కర్మచక్రముల గురించి తెలియదని అర్థమగుచున్నది. వాటి వివరము తెలియకనే, పూర్వము ఎవరో చెప్పిన పండ్రెండు లగ్నముల పేర్లను మాత్రము జ్ఞాపకము పెట్టుకొని చెప్పుకొనుచున్నారు. అందువలన నేటి జ్యోతిష్యము గాడి తప్పినదై పోయినది. దానివలన జ్యోతిష్యము శాస్త్రము కాదేమోనని కొందరంటున్నారు, కొందరు మూఢనమ్మకమనీ, కొందరు శాస్త్రముకాదనీ అంటున్నారు. జ్ఞానజ్యోతి కల్గినవారై మన శరీరములోనే, శిరస్సుయందు కాల, కర్మ అను రెండు చక్రములున్నవని తెలిసీ, కాలచక్రములో గ్రహములు, కర్మచక్రములో పాప పుణ్యములున్నాయని తెలిస్తేనే జ్యోతిష్యము గాడిలో పడుతుంది మరియు ఇది శాస్త్రమని తెలియబడుతుంది. ఇపుడు తలలోని నాల్గుచక్రముల సముదాయములోని కర్మచక్రమును గురించి వివరించు కొందాము. నాల్గు చక్రములలో క్రిందినుండి రెండవచక్రము కర్మచక్రముగా ఉన్నది. కర్మచక్రమును తర్వాత పేజీలోగల 4వ చిత్రపటమునందు చూడవచ్చును.