పుట:Jyothishya shastramu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గౌరవము లభించుట వలన ప్రజలు సన్మానింతురు. అలాగే ప్రభుత్వము వారు కూడా సన్మానింతురు. ఓర్పు, నిగ్రహశక్తి కల్గియుండును. సకల సంపదలు దిన దినాభివృద్ధి చెందును. మంచి భవనములు నిర్మించుకొనును. దేవతా మందిరములు, మండపములు కట్టించును. దైవకార్యములను చేయించుట, పాల్గొనుట జరుగును. స్వంత సంపాదన పెరిగి జీవనమునకు ఆటంకము లేకుండ జరుగును. ముద్రణావిషయములో చొరవకల్గి గృహములను నిర్మించినట్లు గ్రంథములను తయారు చేయగలడు, వ్రాయ గలడు. దీనితో ప్రజాధరణ పెరుగును. అష్టభోగములను అనుభవించుచూ, ఎదురులేని జీవితము గడుపును. ఈ స్థానములో సూర్యుడుగానీ, చంద్రుడు గానీ శుభులైయుండిన ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగియై (కలెక్టరై) ప్రజాపాలన చేయును. ఉద్యోగి కాకుండ, ఉద్యోగమును వదలి రాజకీయములో ఉండి నట్లయితే మంత్రిపదవి కల్గి ప్రజలను పాలన చేయును. దశమ స్థానములో కుజగ్రహము శుభగ్రహమైయుంటే అతడు ప్రభుత్వ డాక్టరుగా మంచి ఆపరేషన్లు చేయు డాక్టరుగా ప్రజలలో మంచి పేరు తెచ్చును. కుజ గ్రహముతో పాటు సూర్యుడో, చంద్రుడో పదవ స్థానమున ఉండుట వలన జాతకుడు మిలిటరీలో పెద్ద డాక్టరుగా ఉండును. ఇదే స్థానములో శుక్ర గ్రహముంటే జీవితము మొత్తము సుఖమయమైపోవును. అన్ని సుఖములతో అష్టఐశ్వర్యములతో జీవితము గడచిపోవును. ఈ విధముగా గ్రహమునుబట్టి జరుగుచుండును. ఒకవేళ దశమస్థానములో పాప గ్రహముండిన పైన చెప్పిన వాటికి భిన్నముగా, వ్యతిరేఖముగా జరుగును. కర్మచక్రములోని పదవ స్థానములోని పాపమునుబట్టి పాపగ్రహములు అక్కడ చేరునట్లు ప్రకృతిద్వారా దేవుడు చేయించాడు. పాపగ్రహములుండుట వలన జీవితమే వృథా అనిపించినట్లుండును. జీవనమునకై నిరంతరము బాధపడుచూ బ్రతుకవలసివచ్చును.