పుట:Jyothishya shastramu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమెవలన సుఖము స్నేహము లభ్యమగునట్లు శుభగ్రహము చేయును. సకాల నిద్ర సకాల మైధునము లభించును. పడకగది కూడా సుఖములకు అనుకూలముగా లభించును. ఇదంతయు శుభగ్రహము వలన ప్రథమ స్థానమునుబట్టి ఉండును. మొదటి స్థానములో మరియొక శుభగ్రహముండి అక్కడినుండి ఏడవ స్థానమును తాకుట వలన, ఏడవ స్థానములో మరియొక శుభగ్రహముండిన, అటువంటి జాతకునికి గ్రహముల మూలమున ఒకటవ స్థానము పుణ్యమును ఎదురుగాయున్న ఏడవ స్థానమున అమలు జరిగినట్లు భ్రమింపచేసి సుఖములనిత్తురని తెలియవలెను.

అష్టమము - ఆయుస్థానము

కర్మచక్రములోని ఎనిమిదవ స్థానములో పాపము, పుణ్యము రెండూ ఉన్నాయి. ఈ స్థానములో ఎన్నో విషయములున్నా, ఆయుష్షు విషయమునకే ఎక్కువ ప్రాధాన్యత కలదు. అందువలన ఈ స్థానమును ఆయుస్థానము అంటారు. ఈ స్థానములో ఆయుర్దాయమున్నప్పుడు మరణమును కూడా చెప్పవచ్చును. అంతేకాక జాతకుని జీవనము, దుఃఖము, నరకము, పాప కృత్యములు చేయుట మున్నగునవి కలవు. ఇవన్నియు పాప మరియు పుణ్యములబట్టియుండును. ఈ స్థానమున మంచి గ్రహము (శుభ గ్రహము) ఉన్నా లేక తాకినా జాతకుడు ఎక్కువ కాలము జీవించునని చెప్పవచ్చును. పుణ్యగ్రహముండుట వలన ఆ స్థానములోని పుణ్యమును మాత్రము స్వీకరించి మనిషికి అందించుట వలన జాతకుడు దేహపుష్ఠి, వీర్యపుష్ఠి కలిగి కామసౌఖ్యమును అనుభవించును. ఎక్కువ కన్యలతో సంబంధము కల్గునట్లు చేయును. దీర్ఘనాడికల్గియుండుట వలన రతికేళిలో ఎక్కువ కాలము గడుపును. అవమానములు, కలహములు లేకుండ చేయును.