పుట:Jyothishya shastramu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోట్లాడుచుందురు. శాంతి లేకుండపోయి కోపము వచ్చుచుండును. ఒకవేళ శుభ గ్రహమున్నట్లయితే అన్నదమ్ముల వలన సుఖము లేకున్నా వ్యతిరేఖము లేకుండా సాధారణముగా ఉందురు. మంచి గ్రహమున్న ఆ స్థానములో పుణ్యము ఏమాత్రము లేనందున పైన చెప్పిన విషయములలో సుఖము ఉండదు. అట్లని కష్టముండదు. ఈ స్థానములో పాపము మాత్రముండుట వలన ధనము లేకుండా చేయును. జీవన విధానమును చెరచి నీచ జీవనము చేయునట్లు చేయును. తండ్రి ఆస్తి తనకు దక్కకుండా పోవును. ఉత్సాహము లేకుండ పోయి అశాంతితో జీవించునట్లు, సేవకా వృత్తిలో కాలము గడుపునట్లు చేయును.

చతుర్థము - మాతృస్థానము

నాల్గవ స్థానము అంగీ భాగములో కేంద్రముగాయున్నా ఇది పాప పుణ్యముల రెండిటికీ నిలయము. ఈ స్థానము తల్లికి, వాహనమునకు, భూమికి, గృహమునకు, కోనేరు, బావి, చెరువులకు, వ్యయసాయమునకు, పశువృద్ధికి, పంటలకు, బంధువులకు నిలయముగా ఉన్నది. సకల వస్తువులు ఉన్నచోటు, సమస్త పంటలు పండుచోటు ఈ స్థానములోనే కలదు. ఈ స్థానమున ఒక శుభగ్రహముండినా లేక ఈ స్థానమును తాకినా వస్తు బలముండును. ఈ స్థానములోని పుణ్యమును శుభగ్రహము (పుణ్యగ్రహము) స్వీకరించి జాతకునికి ఇచ్చుట చేత గృహములు, గృహము లోని వస్తువులు, ధన, కనక, వస్తు వాహనములు, భూములు, జలాశయము లు, బావులు, వనములు కల్గును. అంతేకాక బంధు మిత్రుల పరివారము, దాస జనములు, పశువృద్ధి, పాలవృద్ధి, ధాన్యవృద్ధి చాలాకలుగును. నమ్మకస్తులైన బంధువుల బలము కల్గును. మాతృప్రీతి ఎక్కువ ఉండును.