పుట:Jyothishya shastramu.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిన తిథి, వారములను తెలియవచ్చును. అలాగే పుట్టిన సమయములను బట్టి ఆ దినము యొక్క నక్షత్రమును తెలియవచ్చును. పుట్టిన తేదీని, సమయమునుబట్టి జ్యోతిష్యులైనవారు ఆ దిన పంచాంగము ప్రకారము జాఫతకమును నిర్ణయింతురు. ఆ దిన పంచాంగమునుబట్టి ఆ వ్యక్తి పుట్టిన సమయములో కాలచక్రమునందు ఏ గ్రహము ఎక్కడున్నది తెలిసి పోవును. అలా తెలిసిన దానినిబట్టి పన్నెండు లగ్నములలో పన్నెండు గ్రహములు ఎక్కడున్నది వ్రాసి చూచుకోవచ్చును. అలా వ్రాసుకొన్న దానిని జన్మలగ్నకుండలి అంటారు. పంచాంగము ప్రకారము జనన సమయములో కాలచక్రములోని సూర్యుడు తన కిరణములను కర్మచక్రముమీద ఎక్కడ ప్రసరించుచున్నాడో దానికి సరిగ్గా కాలచక్రములోనున్న లగ్నమును జన్మ లగ్నముగా లెక్కించబడును. జన్మలగ్నమును తన స్థానముగా (శరీర స్థానముగా) లెక్కించి అక్కడినుండి మిగతా గ్రహములను మిగతా లగ్నము లలో ఉన్నట్లు లెక్కించుకొనవలెను. పంచాంగము ప్రకారము ఏ గ్రహము ఏ లగ్నములో ఉన్నదీ, ఆ లగ్నములో ఏ పాదములో ఉన్నదీ గుర్తించవచ్చును. ఆ విధముగా ఒక మనిషి పుట్టిన సమయమునూ, దినమునూబట్టి ఎప్పుడైనా అతని లగ్నకుండలిని వ్రాసుకోవచ్చును. ఒక్కమారు వ్రాసుకొన్న జాతక లగ్నము అతని జీవితాంతము పనిచేయును. జీవితములో ఏ సమస్యనైనా జాతకములో ఎట్లున్నదో చూచుకోవచ్చును. జన్మ సమయములో ఏ లగ్నము నందు ఏ గ్రహమున్నదో ఆ గ్రహములు కాలగమనములో ఎక్కడ తిరిగినా ఏ లగ్నములో ఉన్నా జీవితాంతము మొదటి నిర్ణయము ప్రకారమున్నట్లే తమ ప్రభావము చూపుచుండును. ఉదాహరణకు ఒక జాతకుని జన్మ సమయముననున్న లగ్నకుండలిని తర్వాత పేజీలోని 51వ చిత్రపటములో చూస్తాము.