పుట:Jyothishya shastramu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పన్నెండు గ్రహముల ఆధీనములోనున్న ధాన్యములను చూచాము కదా! గ్రహముల మిత్ర శత్రు వర్గమునుబట్టి ఆరు గ్రహములు మిత్రులుగా యున్నవి. జాతకునికి జ్యోతిష్యము ప్రకారము ఏవి మిత్రగ్రహములో తెలియును కదా! మిత్రగ్రహముల ఆధీనములోని ఆరురకముల ధాన్యముల వలన ఆ వ్యక్తికి (ఆ జాతకునికి) ఆరోగ్యము చేకూరుననీ, మిగతా ఆరు శత్రుగ్రహముల ధాన్యముల వలన పోషక పదార్థములు లభించవనీ, ఆ ధాన్య ఆహారము వలన అనారోగ్యములు కల్గుననీ చెప్పవచ్చును. గ్రహము లను బట్టి సరిపడని ఆహారమును గుర్తించుకోవచ్చును. ఉదాహరణకు సూర్యుడు శత్రువర్గములోని గ్రహమైతే సూర్యుని ధాన్యమైన గోధుమలతో చేసిన రొట్టెలు, చపాతీలు, పూరీలు మొదలగు పదార్థములను తింటే అజీర్ణముగా ఉండడము, గొంతులో మంట రావడము జరుగు చుండును. అటువంటివారు గోధుమల ఆహారము సరిపోదని బియ్యము అన్నమునే తినుచుందురు. కొందరికి ఉలవలు తింటే విపరీతమైన వేడియగును. కొందరి స్త్రీలకు వేడివలన నెలకు ఒకమారు వచ్చు బహిష్టు (ముట్టు) నెలకాకనే ముందుగానే వచ్చును మరియు ఎక్కువగా వచ్చును. కొందరికి జొన్నలు తింటే సరిపడదు, విరేచనములగును. దానికి కారణము భూగ్రహము వారికి సరిపోదనీ, శత్రువుగా ఉన్నదనీ తెలియవలెను. ఈ విధముగా గ్రహములు వాటి ధాన్యమును గురించి తెలియవచ్చును. ఇప్పుడు పన్నెండు గ్రహములకు ఆధీనములోనున్న దినములను, వాటి పేర్లతో సహా చూద్దాము.