పుట:Jyothishya shastramu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా భావములో యోగము అంటే కలయిక అనీ, కరణము అంటే చేయుచున్న వాడనీ లేక చేయుచున్నదనీ అర్థము. వీటిని గురించి అందరికీ తెలుపగలను.

మాకు తెలిసిన యోగము, కరణము రెండు రకములు కలవు. ఒకటి జ్యోతిష్య భావము ప్రకారము, రెండు ఆధ్యాత్మిక భావము ప్రకారము రెండు విధముల భావములు కలవు. జ్యోతిష్య భావము ప్రకారము చెప్పుకొంటే, రెండు గ్రహముల కలయికను యోగము అని అనుచుందురు. ఒకే లగ్నములో రెండు గ్రహములు కలిసిన, ఆ గ్రహముల పేరుతో దానిని యోగము అంటారు. ఉదాహరణకు బుధుడు, సూర్యుడు ఒక్క లగ్నములో కలిసినప్పుడు జరుగు కాలమును ‘‘బుధార్క యోగము’’ అంటారు. రెండు శుభగ్రహములు ఒక లగ్నములో కలిసిన వారిరువురు కలిసి ఇచ్చు మంచి ఫలితములను అనుభవించు కాలమును యోగము అని అనడము జరుగు చున్నది. బయట దృష్ఠికి పనులను చేయువానిని కరణము అంటున్నాము. కరణమైన వాడు యోగము అనుభవించును అని జ్యోతిష్యములో పూర్వము చెప్పెడివారు. ఇకపోతే బ్రహ్మవిద్యాశాస్త్రము ప్రకారము జీవాత్మ ఆత్మ అను రెండు ఆత్మల కలయికను యోగము అంటారు. పని జరుగుటకు కారణమైన కర్మను కరణము అంటాము. జ్యోతిష్యములో రెండు గ్రహముల కలయిక యోగమైతే, ఆధ్యాత్మికములో రెండు ఆత్మల కలయిక యోగమగును. అలాగే జ్యోతిష్యములో పని జరుగుటకు కారణమైన మనిషిని కరణము అంటాము. ఆధ్యాత్మికములో కార్యము జరుగుటకు కారణమైన కర్మను కరణము అంటాము. అయితే పంచాంగములో రెండు అంగములైన యోగ, కరణములను యోగములుగా గ్రహముల కలయికనూ, కరణముగా పని చేయుచున్న మనిషినీ లెక్కించుకోవచ్చును.