పుట:Jyothishya shastramu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ దిన పంచాంగములో ఉన్న దానినిబట్టి ఏ లగ్నములో, ఎన్నో పాదమందు, ఏ గ్రహముకలదో గుర్తించుకొన్నాము. ముఖ్యముగా గమనించ తగ్గ విషయమేమనగా! ఇక్కడున్న పన్నెండు గ్రహముల సమాచారము పంచాంగములలో ఉండదని తెలుపుచున్నాము. ఇంతవరకు జ్యోతిష్య శాస్త్రములలోగానీ, పంచాంగములలోగానీ నవగ్రహములను గురించియే చెప్పుకొన్నారు. మిగత భూమి, మిత్ర, చిత్ర గ్రహములను గురించి ఎవరు గానీ, ఎక్కడగానీ చెప్పలేదు. అందువలన పంచాంగములో భూమి, మిత్ర, చిత్ర గ్రహముల సమాచారముండదు. పంచాంగములలో లేకున్నా మూడు గ్రహముల స్థానములను పాదములను మేము ఎలా చెప్పగలిగామో తర్వాత వివరిస్తాము. దాని ప్రకారము మీరు కూడా భూమి, మిత్ర, చిత్రగ్రహములను గుర్తించుకోవచ్చును. ఇకపోతే అందరికీ తెలిసిన చంద్రగ్రహము యొక్క విషయము కూడా పంచాంగములలో ఉండదు. చంద్రుడు మినహా ఎనిమిది గ్రహముల లగ్నములను వాటి పాదములను చెప్పిన పంచాంగములు చంద్రుని విషయమును వదలివేశాయి. చంద్రుడు ఏ లగ్నమందు ఎన్నో పాదమునగలడో జ్యోతిష్యులైనవారు స్వంతముగా తెలుసుకోవలసియున్నది. పంచాంగములో చంద్రుడు ఏ నక్షత్రములో ఉన్నదీ వ్రాయబడియుండును. ప్రతి దినము క్యాలెండర్‌లోగానీ, పంచాంగములోగానీయున్న నక్షత్రము ఏదైతే ఉన్నదో అది చంద్రునిదనియే తెలియవలెను. నక్షత్రము తెలిసినా పాదము కొరకు కొంత గణితమును ఉపయోగించి తెలియవలెను. అదెలాగో క్రింద చూస్తారు.