పుట:Jyothishya shastramu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2009 సంవత్సరము ఫిబ్రవరి నెల 17వ తేదీన అష్టమి మంగళ వారము పుట్టిన రంగయ్య అను వ్యక్తి జాతకమును చూచుటకు ముందుగా అతని జన్మ కర్మచక్రములో ఎక్కడినుండి మొదలైనదో, లగ్న పరిమాణ కాలములను చూచి సూర్యోదయము తర్వాత ఏ లగ్నముతో మొదలైనదో తెలుసుకొన్నాము. ఉదయము అతను జన్మించిన 9 గంటల సమయమునకు సరిగా మీనలగ్నము మీద సూర్యుడున్నట్లు తెలుసుకొన్నాము. సూర్య గమనముతోనే మనిషి ప్రారబ్ధము ప్రారంభమగుచున్నదని తెలుసుకొన్నాము. రంగయ్య జనన కాలమైన 9 గంటలకు కాలచక్రములో ఏయే గ్రహములు ఎక్కడెక్కడున్నవో పంచాంగము ద్వారా తెలుసుకోవచ్చును. జనన కాలములో పన్నెండు లగ్నములందున్న గ్రహములే జీవితాంతము ప్రభావము చూపు చుండును. అందువలన పన్నెండు గ్రహముల స్థానములను ద్వాదశ లగ్నములలో గుర్తించుకొని, దానిని ప్రారబ్ధ కర్మపత్రముగా లెక్కించి చూచుకోవచ్చును. జనన కాలములో ఆ విధముగ గుర్తించుకొనిన పన్నెండు లగ్నముల కాలచక్రమునుబట్టి కర్మచక్రములోని రాశులందు కనిపించక యున్న కర్మను కొంతవరకు గుర్తించుకోవచ్చును. పూర్తి ప్రారబ్ధకర్మను గుర్తించుటకు వీలుపడదు. అయినా కొంతవరకైనా గుర్తించవచ్చును. ప్రారబ్ధకర్మను కర్మచక్రములో వ్రాసి చూచుకొను అవకాశము జ్యోతిష్య శాస్త్రములో లేదు. అయితే కాలచక్రములోని గ్రహములను మాత్రము గుర్తించుకొని వారి కదలిక వలన ఏ కర్మలు అమలు జరుగునో కొంత వరకు చెప్పుకోవచ్చును. కాలచక్రములో కనిపించే గ్రహములు కర్మచక్రము లోని కర్మరాశులందు గల కర్మను అందించుటకు కాలచక్రములో ఎలా ఉన్నవో ఇప్పుడు గుర్తించుకొందాము.