పుట:Jyothishya shastramu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిద్ధాంతములు గ్రంథరూపములో వ్రాయబడినవి. అలా సిద్ధాంత రూపములో ఉన్న గ్రంథమును జ్యోతిష్య గ్రంథము అంటున్నాము. ఆరు శాస్త్రములలో పెద్దదైన బ్రహ్మవిద్యా శాస్త్రమును స్వయముగా దేవుడే చెప్పగా, మిగతా ఐదు శాస్త్రములు మనిషి చేత చెప్పబడినవి. మొత్తము ఆరు శాస్త్రములు పూర్వమునుండి ఉన్నవే, అయినా కాలక్రమమున కొన్ని భావములు మారిపోయిన దానివలన, మనుషులు వాటిని పూర్తి అసలైన భావముతో అర్థము చేసుకోలేక పోతున్నారు. బ్రహ్మవిద్యాశాస్త్రము తర్వాతనున్న జ్యోతిష్యశాస్త్రముపై పూర్తి అవగాహన లేకపోగా, మిగత ఖగోళశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయన శాస్త్రము, గణితశాస్త్రము అను నాలుగు శాస్త్రములు ఎంతో అభివృద్ధి చెంది మనిషికి బాగా అవగాహనలో ఉన్నాయి. పెద్దవైన బ్రహ్మవిద్యాశాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము రెండూ మనిషి అవగాహనలో లేకుండ పోవడము వలన వాటిలోని శాస్త్రీయత అనునది తెలియకుండ పోయినది. శాస్త్రీయతను చూడకుండ మనిషి తనకిష్ట మొచ్చినట్లు చెప్పుకోవడము వలన, జ్యోతిష్యమును శాస్త్రమే కాదని కొందరంటుండగ, బ్రహ్మవిద్యాశాస్త్రమనునది అసలుకే లేదని నాస్తిక వాదులు అంటున్నారు. నేటికాలములో నాస్తికులకుగానీ, ఆస్తికులకుగానీ బాగా కనిపించే శాస్త్రములు 1) గణిత, 2) ఖగోళ, 3) రసాయన, 4) భౌతిక శాస్త్రములే! అందువలన ఆ నాలుగు, బహుళ ప్రచారములో ఉండగ, శాస్త్రీయత లోపించినవిగా జ్యోతిష్యము, బ్రహ్మవిద్య రెండూ కనిపిస్తున్నవి. ఎవరికి ఎట్లు కనిపించినా, ఈ రెండు స్వచ్ఛమైన శాస్త్రములే. బ్రహ్మవిద్యనూ, జ్యోతిష్యమునూ పూర్వమువలె చెప్పుకొంటే అవి రెండు శాస్త్రములని ఇటు నాస్తికులకు, అటు ఆస్తికులకు, శాస్త్రపరిశోధకులకు తెలియగలదు.