పుట:Jyothishya shastramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచాంగము యొక్క పరిచయము లేనివారికి కొంత ఇబ్బందిగా ఉండి, వ్రాసిన సమాచారము కొంత అర్థముకాక పోయివుండవచ్చును. అయితే ఇక్కడ మనము గమనించవలసిన విషయమేమంటే జ్యోతిష్యము వేరు, పంచాంగమువేరని తెలియవలెను. జ్యోతిష్యమును తెలియుటకొరకు పంచాంగమునుండి కొంత చూచుకోవలసియుంటుంది. అంతేగానీ పంచాంగమునంతటినీ తెలియవలసిన అవరసములేదు. వాస్తవముగా చెప్పితే పంచాంగమును గూర్చి నాకు కూడా పూర్తి తెలియదు. జ్యోతిష్యుడు పంచాంగములోని అవసరమైన కొన్ని అంగములను మాత్రము వాడుకొంటాడు, అంతేగానీ అంతా అవసరముండదు. పంచాంగమునకు అర్థమును చెప్పుకొంటే ఐదు అంగములు కలది పంచాంగము అని అనవచ్చును. అంగము అంటే భాగము అని ఇక్కడ అర్థము చేసుకోవలెను. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములను ఐదు సమాచారములను తెలుపు దానిని పంచాంగము అని అంటున్నాము. ఈ ఐదు విషయ భాగములలో మన జ్యోతిష్యమునకు ముఖ్యముగా ఉపయోగపడునది నక్షత్రము మాత్రమే. తిథి, వారములను, యోగ కరణములను గుర్తింపుకు వాడుకున్నా ముఖ్యముగా అవసరమైనది నక్షత్రము మాత్రమేనని తెలియాలి. అందువలన పంచాంగములో నక్షత్రము అను అంగము ముఖ్యముగా ఉపయోగ పడుచున్నది.

జ్యోతిష్యమునకు ముఖ్యమైన నక్షత్రమును గురించి కొంతవరకు తెలుసుకొంటే ముందు తెలుసుకోబోవు విషయములు సులభముగా అర్థముకాగలవు. నక్షత్రము అనగా నాశనములేనిదను ఒక అర్థము కలదు. అలాగే కనిపించని ప్రదేశమని కూడా అర్థము కలదు. ఇక్కడ సందర్భమును బట్టి రెండవ అర్థమును తీసుకొందాము. కాలచక్రములోనున్న కనిపించని స్థలమును నక్షత్రములని అంటున్నాము. కాలచక్రము యొక్క పన్నెండు