పుట:Jyothishya shastramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేయునప్పుడు క్రింద కాళ్ళకు చెప్పులు ధరించి నడచినప్పుడు భూమి ఎంత వేడిగాయున్నా ఆ వేడి అతని పాదముల క్రింద తెలియదు. ఒకవేళ కాళ్ళకు చెప్పులు లేకుంటే పాదములకు వేడి తెలిసి ఆ బాధను అనుభవించ వలసివచ్చును. చెప్పులున్న వానికి కాళ్ళు కాలవు, అయినా పైన ఎండవేడి తలకు ముఖమునకు తగులుచుండుట వలన కొంత బాధపడవలసివచ్చును. కాళ్ళకు చెప్పులూ, తలకు గొడుగు ఉన్నవాడు క్రింద బాధ, పై బాధ రెండు తెలియకుండ ప్రయాణమును సాగించును. ఒకవేళ తలకు గొడుగూ, కాళ్ళకు చెప్పులూ రెండూ లేనివాడు పైన క్రింద రెండు బాధలను అనుభ వించవలసి వచ్చును. ఒక ప్రయాణికునికి కాళ్ళకు తలకు ఎండవేడి బాధ రెండు రకములుగా ఉన్నట్లు, ఒక జీవికి కర్మ రెండు రకముల అనుభవము నకు వస్తున్నది. ఎండ బాధ క్రింద కాళ్ళకు, పైన తలకు తగిలినట్లు, కర్మ బాధ ఒక ప్రక్క గ్రహచారము ప్రకారమూ మరొక ప్రక్క దశాచారము ప్రకారమూ కలుగుచున్నది. చెప్పులు గొడుగు రెండూ ఉన్నవాడు సుఖముగా ప్రయాణము సాగించినట్లు, గ్రహచారము దశాచారము రెండూ బాగున్న వాడు సుఖముగా జీవితమును సాగించును. చెప్పులు, గొడుగు రెండూ లేనివాడు కష్టముగా ప్రయాణమును సాగించినట్లు, గ్రహచారము, దశా చారము రెండూ బాగలేనివాడు జీవితమును కష్టముగా సాగించును. చెప్పులుండి గొడుగు లేనివాడుగానీ, గొడుగుండి చెప్పులు లేనివాడుగానీ క్రిందనో పైననో ఒకవైపు బాధను అనుభవించినట్లుండును. గ్రహచారము బాగుండి దశాచారము బాగలేనివాడుగానీ కర్మను పూర్తి అనుభవించును. గ్రహచారము బాగాలేక దశాచారము బాగున్నవాడు కొంత కర్మను అనుభవిస్తూ, కొంతకర్మ అనుభవించక తప్పించుకొని మిగత కొంత కర్మ అనుభవముతోనే జీవితమును సాగించును.