పుట:Jyothishya shastramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయినా రాశి అను పేరును కాలచక్రములోని భాగములకు వాడకూడదు. ఇకపోతే కర్మచక్రములోని పన్నెండు భాగములను పన్నెండు స్థానములుగా చెప్పుకొనుచున్నాము. కాలచక్రములోని ప్రతి భాగమునకు ఒక పేరు కలదు. కర్మచక్రములోని భాగములకు పేర్లులేవు. వాటికి సంఖ్యమాత్రము ఉండును. అందువలన మూడవ స్థానమనీ, నాల్గవ స్థానమనీ స్థానములకు సంఖ్యను చేర్చి చెప్పుచున్నాము. సంఖ్యల స్థానములుగా చెప్పబడు పేరులేని భాగములైన కర్మచక్రస్థానములను రాశులని పిలువడము జరుగుచున్నది. రాశి అంటే దేనినైనా కుప్పగా పోసినప్పుడు ఆ కుప్పను రాశి అనడము జరుగుచున్నది. కర్మచక్రములోని అన్ని భాగములలోనూ కర్మను రాశులుగా నింపియుండడము వలన, ప్రతి మానవుడు కర్మచక్రములోని రాశులలోనున్న కర్మనే అనుభవించడము జరుగుచున్నది. కర్మచక్రములోని పన్నెండు స్థానములలో కర్మ పేర్చబడియున్నది. కావున ప్రతి స్థానమును రాశి అంటున్నాము. కర్మచక్రములోని ఏ స్థానములో ఏ కర్మ రాశిగా పోయబడు చున్నదో, మనము ఇంతకు ముందే తెలుసుకొన్నాము.

లగ్నము అనగా అంటిపెట్టుకొనియున్నదనీ, తగులుకొనియున్నదనీ చెప్పవచ్చును. కాలచక్రములో గల పన్నెండు గ్రహములు ఏదో ఒక స్థానమును అంటిపెట్టుకొని ఉండుట వలన ఆ స్థానములను లగ్నములు అన్నాము. ప్రతి గ్రహము కొంతకాలము ఒక స్థానమును అంటిపెట్టుకొని యుండి తర్వాత మరియొక ప్రక్క స్థానములోనికి చేరుచున్నది. అందువలన కాలచక్రములోని స్థానములను లగ్నములను పేరుతో చెప్పుచున్నాము. ఒక గ్రహము కాలచక్రములోని ఒక స్థానమును ఆశ్రయించుకొని, అక్కడ నుండి తన కిరణములను క్రిందనున్న కర్మచక్రములోని కర్మరాశుల మీద ప్రసరింపజేయుచుండును. ఒక గ్రహము ఒక కాల లగ్నములోవుండి