పుట:Jyothishya shastramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28. కాలచక్రములో ఏ లగ్నము మంచిది?

కాలచక్రములోని పన్నెండు భాగములను పన్నెండు లగ్నములని అందురు. కాలచక్రములోని పన్నెండు లగ్నములకు పన్నెండు పేర్లు కలవని చెప్పుకొన్నాము. వివరముగా చెప్పుకొంటే పన్నెండు లగ్నములను పన్నెండు దేశములుగా పోల్చుకొని చెప్పవచ్చును. ప్రతి లగ్నము కొంత విస్తీర్ణముగల దేశములాంటిది. ఒక్కొక్క దేశమునకు ఒక్కొక్క రాజు అధిపతిగాయున్నట్లు, పన్నెండు లగ్నములకు పన్నెండు గ్రహములు రాజులుగా అధిపతులుగా యున్నారు. ఆ పన్నెండు మంది ఎవరికి వారు మంచివారే, అయినా వారు రెండు గుంపులుగాయున్నారు. ఒకవర్గము వారికి మరొక వర్గము వారు వ్యతిరేఖులుగాయుందురు. మనిషి జన్మించిన కాలమునుబట్టి, ఆ మనిషి ఒక వర్గము వారికి చెందినవాడుగా నిర్ణయించబడును. అప్పుడు ఒక వర్గమువారైన ఆరుమంది రాజులు లేక లగ్నాధిపతులు మనిషికి మిత్రులుగా ఉండగా, వారివైపుకు పోయినందుకు ఆ మనిషికి మిగత ఆరు గ్రహములు శత్రువులుగా తయారగుదురు. ఏ మనిషికైనా దేశములుగానీ, ప్రదేశములుగానీ ఏ భావములేనివిగా, నిర్జీవమైనవిగా, అందరికీ సమానముగా ఉండును. సమానముగా లేనివారు ఆయా లగ్నములకు సంబంధించిన అధిపతులేనని తెలియవలెను. కొందరు మిత్రులైతే, కొందరు శత్రువులుగా ఉందురు. మనిషి కర్మనుబట్టి వాని జన్మనుబట్టి, జన్మించిన లగ్నమునుబట్టి మనిషికి లగ్నాధిపతులు ఆరుమంది శత్రువులుగానూ, ఆరుమంది మిత్రులుగాను ఏర్పడుచుందురు. కాలచక్రములోని లగ్నాధిపతు లైనవారు మనిషి ఎడల మంచిగా కొందరు, చెడుగా కొందరు ఉండుట వలన, కాలచక్రములోని లగ్నాధిపతులలో మంచివారుండవచ్చును గానీ, లగ్నములు మంచి, చెడు అనునవి ఉండవు. లగ్నములు అని పేరు పెట్టబడిన పన్నెండు భాగములు పన్నెండు ప్రదేశములేగానీ అందులో మంచి చెడు అనునవి ఉండవు.