పుట:Jyothishya shastramu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండ్రులు దైవభక్తికలవారైతే వారి పిల్లలు కూడా కొంత దైవభక్తి కల్గియుండడము జరుగుచున్నది. కర్మచక్రములో ఐదవస్థానము ప్రపంచ జ్ఞానమునకు సంబంధించినదిగా ఉండుట వలన, దానికి ఎదురుగాయున్న పదకొండవ స్థానము భక్తి, జ్ఞాన, ధర్మములకు సంబంధించినదియుండగా, ఈ రెండు స్థానములలోని బుద్ధి భావములు, జ్ఞాన, భక్తి భావములు సంతతికి వచ్చుచుండుట వలన ఎవరికైనా సంతానమును గురించిన కర్మ సమాచారము 5,11 స్థానములలోనే ఉండునని తెలియుచున్నది. ఈ విధముగా కొన్ని కర్మలను ఏ స్థానములలో ఉన్నది గ్రహించవచ్చును.

శాస్త్రము అనగా సత్యము, సత్యము అనగా శాస్త్రమని చెప్పవచ్చును. కొన్ని కర్మలు జరిగెడు యదార్థసంఘటనలనుబట్టి తెలియవచ్చును. ఇప్పుడు సంతతి ఎటువంటిదో తెలియుటకు 5,11 స్థానములను చూడవచ్చుననుట శాస్త్రబద్ధమా అని ఎవరైనా అడిగితే దానికి సమాధానముగా ఇట్లు చెప్పవచ్చును. కొన్ని శాస్త్రబద్ధముగా వ్రాసిపెట్టబడియుండును. కాబట్టి వాటిని అనుసరించవచ్చును. కొన్ని విషయములు వ్రాయనివి కూడా ఉండవచ్చును. అప్పుడు జరిగిన సత్యమునుబట్టి ఇది శాస్త్రమని తెలియ వచ్చును. ముందే ఇతరుల చేత వ్రాయబడిన శాస్త్రమునుబట్టి కొన్ని విషయములను చెప్పవచ్చును. కొన్ని జరిగిన సత్యములనుబట్టి కొన్ని శాస్త్ర విషయములను కనిపెట్టి చెప్పవచ్చును. సంతాన విషయములో మేము జరుగుచున్న సత్యమునుబట్టి 5,11 స్థానములు శాస్త్రబద్ధముగా సంతాన స్థానములని చెప్పుచున్నాము. ఇదే పద్ధతిలో కొన్ని విషయములను అప్పటి కప్పుడు గ్రహించవచ్చును.