విజ్ఞప్తి
గుంటూరు తాలూకా యేటుకూరు గ్రామము నందలి “జ్ఞాన ప్రసాదినీ” పుస్తక భాండాగారపక్షమున 1913 సంవత్సరము సెప్టంబరు 10వ తేదీన “ప్రస్తుత హిందూ దేశీయులవిద్య, దాని నభివృద్ధి చేయు విధము” అను నొక వ్యాస మచ్చు వేయింపబడి పంచి పెట్టబడినది. ఆ ప్రకారమే మరికొన్ని వ్యాసములను ప్రకటింపవలయునని ఆగ్రంథభాండాగారమువారు తలచియు, కొన్ని కారణములచే నట్లొనర్పజాలకపోయిరి.
పిమ్మట అట్టి కరపత్రములను వీలగునెడ పక్షమునకొక మారును, లేనిచో మాసమున కొకటివంతునను ప్రకటించి చదువ నేర్చినవారి కెల్లరకును, అందజేయుచుండవలెనను ఉద్దేశముతో మా ఈ “జ్ఞానప్రసాదినీ ప్రచురణ సంఘ” మేర్పరుపబడినది. తాము ప్రకటించిన కరపత్రము నెడ దమకుగల సర్వాధికారమును మాకే వదలి వేసిన పై భాండాగారము వారికి మేమెంతయు కృతజ్ఞులము.
మేము ప్రకటింప నెంచిన వ్యాసములన్ని యు, కొంచెముగ తెలుగుభాష చదువ నేర్చి, కొంతయనుభవముకలిగియున్న సామాన్యజనులందరకును, ఉన్నత పాఠశాలల(HiighSchools) లలో విద్యనభ్యసింపుచు, ఇంకను కళాశాలల (Collegesలో) జేరని విద్యార్థులకును, ఉపయోగపడవలయునని మాకోరిక .