గాని యీరెండింటికి భేదముగలదు. ఎట్లన, పాము చలింపకుండునప్పుడు దానియా కారమునందు మెలిక లుండక తిన్న గానుండును. ఈ మెలికలు పాము కదలునప్పుడు మాత్రము గలుగును. కాని సూక్ష్మ వ్యావర్తకయొక్క మెలికలు కదలకుండునప్పుడు సహితము దాని శరీరమునందు స్థిరముగ నుండుట చేత దానిసహజ నిర్మాణమునందే యీ మెలికలు గలవని తెలిసికొందుము. సూక్ష్మ వ్యావర్తకకును రెండుకొనలయందును తోకలవంటి మృదురోమములు గలవు.
మృదురోమము.
మృదురోమ మనగ నేమి? ఈమృదురోమము సూక్ష్మజీవులకు చలనము నెట్టు కలిగించును? కను రెప్ప వెండ్రుకలవలె నుండుటచేత దీనికి రోమమను పేరు గలిగినది. అయిననిది రోమమువలె కఠినముగను, నలుపురంగు గలదిగను నుండునవి తలంపవలదు. ఇది పట్టువలె మిక్కిలిమృదువుగను, స్ఫటికమువలె స్వచ్ఛముగను ఉండి ఎల్లప్పు డతివేగమున ముందుకును వెనుకకును ఊగుచుండును.
వికారిణియొక్క చలనమునుగూర్చి వ్రాయునప్పుడు అది తన దేహమునందలి మూలపదార్థమును అక్కడక్కడ పాదములుగ చాచి తన యిచ్చవచ్చిన వైపునకు నెమ్మదిగా కదలుచుండునని చెప్పియున్నాము. వికారిణికి పాదమును తన దేహమునందేభాగమున పెంచినను బెంచగలదు; వానిని తనైచ్చకొలది ముడుచుకొనను గలదు.