ఆంధ్రజనులందరును ఈకూర్పునకుగూడ మునుపటివలె తమతోడ్పాటునుజూపి నన్నును విజ్ఞానచంద్రికా మండలి వారిని ప్రోత్సాహపరచెదరని నమ్ముచున్నాను.
- ఆచంట-లక్ష్మీపతి.
చింతాద్రిపేట
20-1-1909.
మొదటికూర్పునకు
పీఠిక.
ప్రకృతిశాస్త్ర సంబంధమైన గ్రంథములు మన దేశభాషలందు లేనిలోపము అందరకును తెలిసినవిషయమే. అట్టి గ్రంథములు ఆంగ్లేయభాషయందు పెక్కు లున్నను ఆ భాషాపరిచయము లేని మనదేశస్థులకు అనుపయోగములుగ నున్నవి. ఇప్పుడిప్పుడు కేవలము దేశభాషాజ్ఞానము గలవారు సహితము పశ్చిమదేశ శాస్త్రాదులయందలి విషయములను తెలిసికొనవలయు ననెడికోరిక, గలవా రగుచున్నను, వారికి తమతమ భాషలందు ఆవిషయములను బోధించు గ్రంథము లెవ్వియు లభింపకున్నవి. ఇదిగాక, ఆంగ్లేయభాషయందలి గ్రంథములు ఆ భాషయందు తగినంత పరిశ్రమ చేసినవారికే తప్ప సామాన్య జ్ఞానము గలవారికి బోధపడవు. ఇట్టి గ్రంథములు లేని లోపమును నివారించుటకై విజ్ఞానచంద్రికా మండలివారు ప్రకృతిశాస్త్ర విషయక, గ్రంథముల నాంధ్రభాషయందు ప్రచురింప సమకట్టి, మున్ముందుగ జీవశాస్త్రమును వ్రాయమని నన్ను కోరిరి. వారి కోరికతోపాటు నాకును అట్టి యుద్దేశము చిరకాలమునుండి యున్నందున, ప్రస్తుతము సావకాశ మంతగా లేకున్నను, నా స్వల్ప