పుట:Jeevasastra Samgrahamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తురులో దీనిని కొంతకాల ముంచినయెడల ఆకుపచ్చని నలుసు లక్కడక్కడ తేలుచుండును. ఇవి ఆకుపచ్చని జీవులసమూహము లని సూక్ష్మదర్శనితో పరీక్షించుటచే తెలియగలదు. ఇట్టి గాజుపాత్ర మనము సామాన్యముగా చూచుచుండెడి పసరెక్కిన నీటిగుంటను బోలియున్నదని చెప్పవచ్చును. పై జెప్పిన కషాయమువలెనే యీ గుంటలందలి మురుగునీరును ఒక్కసారి విరిగి తేరినపిమ్మట తిరిగి మురగనేరదు. కాని యిట్టినిర్మలమైన స్థితికి ఆనీరు వచ్చునప్పటికి కొన్ని మాసములు పట్టును.

క్రొత్తగా తయారుచేయబడిన కషాయమును వడబోత కాగితముతో చక్కగా వడబోసి యం దొకబొట్టు నెత్తి సూక్ష్మదర్శనియందు పరీక్షించునెడల దానియం దేవిధమైన జీవులుగాని, నలుసులు (Particles) గాని కానరావు. అయినను, కలబారిన వెంటనే ఈ కషాయమునం దొక చుక్కను సూక్ష్మదర్శనితో పరీక్షించిన అతి సూక్ష్మమైన జీవులు లక్షలకొలది మిణుకుమిణుకు మనుచు మిక్కిలి వేగముగ పరుగులెత్తుచు కానబడును. ఇవియే సూక్ష్మజీవులు (Bacteria Or Micro-Organisms). ఇవి ఏకకణ ప్రాణులు. ఇందు ప్రతిదానియందును మూలపదార్థమును, జీవస్థానమును గలవు.

సూక్ష్మజీవులలో ననేక జాతులు గలవు. 1. సూక్ష్మతర్కుపు (Bacterium Termo). 2. సూక్ష్మగుటిక (Micrococcus). 3. సూక్ష్మదండిక (Bacillus). 4. సూక్ష్మకంపక (Vibrio). 5. సూక్ష్మవ్యావర్తక (Spirillum). ఇవి యయిదును ముఖ్యమైనవి.