ఎర్రకణముల వ్యాపారములు:- ఎర్రకణముల మూల పదార్థమునందు రక్తగోళక (Haemoglobin) మను ఎర్రని రంగుగల అతి సూక్ష్మములైన రేణువు లనేకము లుండును. ఈ ఎర్ర కణములు మన ఊపిరితిత్తులయందలి తల వెండ్రుకలకంటె సన్ననైన రక్తనాళములలో ప్రవహించునప్పుడు అవి యానాళముల పలుచని పొరలగుండ ప్రాణవాయువును పీల్చి మిక్కిలి యెరుపెక్కి కన్ను చెదర జేయునంతటి కెంపురంగు గల వగును. ఈ ప్రాణవాయువును వహించి ఎర్రకణములు మన శరీరమునందలి సమస్తభాగములకు రక్తప్రవాహమున కొట్టుకొనిపోవును. ఇచ్చట నివి తాము తెచ్చిన ప్రాణవాయువును ఆయాయవయవముల కొప్పగించి వానినుండి బొగ్గుపులుసు గాలిని చేకొని యందుచే కొంచెము నలుపెక్కిన వగును. అంతట నివి తిరిగి ప్రాణవాయువును పీల్చు నిమిత్తమై ఊపిరితిత్తులలోనికి బోయి యచ్చట బొగ్గుపులుసు గాలిని విడిచి ప్రాణవాయువును సంగ్రహించుకొని వచ్చి మరల నాయాయవయవములకిచ్చును. కాబట్టి యీయెర్రకణము లూపిరితిత్తుల నుండి ప్రాణవాయువును అవయవములకు జేర్చునట్టియు, అవయవములయందలి బొగ్గుపులుసు గాలిని ఊపిరితిత్తులమార్గమున వెలిబుచ్చునట్టియు సేవకులని చెప్పవచ్చును.