1. మనము తిను కొవ్వుగలపదార్థములు జీర్ణము కాగా నేర్పడిన అణువులను, తమ పాయల సహాయమున తమ శరీరములో నిముడ్చుకొని, వానిని మోసుకొనుచు, నీ తెల్లకణములు రక్తప్రవాహముగుండ దొర్లుచు పోయి మన శరీరమునందలి సమస్తభాగములకు కావలసిన పుష్టిని ఇచ్చుచుండును.
2. మనము తిను ఆహారమూలమునగాని మన శరీరమునం దెక్కడయినను పడిన కాటుమూలమునగాని మన దేహమునందు ప్రవేశించి విషూచి మొదలగు వ్యాధులను కలిగించునట్టి మన శత్రువు లనదగు సూక్ష్మజీవులతో జగడమాడి వానిని మ్రింగివేసి, వానివలన మన కుపద్రవము గలుగకుండ తమకు సాధ్యమైనంతవర కివి కాపాడుచుండును. ఈసూక్ష్మజీవులగూర్చి రెండవ ప్రకరణములో మనము జదువగలము.
ఎర్రకణములు
వికారిణి పాయలనన్నిటిని ముడుచుకొని యొకబొట్టువలె నైనదని భావింపుము. ఈయెర్రకణము లట్టిరూపమును బోలియున్నవని చెప్పవచ్చును. మానవుల యెర్రకణములందు సామాన్యముగా జీవస్థానములేకపోయినను, కప్ప మొదలగు జంతువుల నెత్తురునందలి యెర్రకణములో పెద్ద జీవస్థాన మొకటి పొటకరించుకొని యుండునట్టు స్పష్టముగ కనబడును. రక్తనష్టము గల్గించు కొన్నిరోగముల యందు మానవుల రక్తమునందలి యెర్రకణములందు సహితము జీవస్థానము లుండును.