పదార్థ సముదాయములే. వికారిణివలెనే యవియును తరుచుగ పాయలు చాచుచు వానిని ముడుచుకొనుచు నానారూపముల బొందుచుండును. ఇవి రక్తములో బడి దొర్లుచు కొట్టుకొనిపోవు నప్పుడు ఆకారముమారి యొకప్పుడు గుండ్రముగాను, ఒకప్పుడు కోలగాను, ఒకప్పుడు కోనములు గలవిగాను, ఒకప్పుడు అడ్డముగాను, ఒకప్పుడు నిలువుగాను, ఒకప్పుడు మరల గుండ్రముగాను ఉండును. ఒకానొక తెల్లకణము పది నిమిషములలో జెందు ఆకారభేదములను ఈ క్రిందిపటము
కనబరచును. వీనిలోకొన్నిటి యందు జీవస్థానము గుండ్రముగను, మరి కొన్నిటియందు పలువిధములుగను ఉండును. ఈకణములను తొగురుచెక్క (Log-Wood) మొదలగురంగులలో కొన్నినిమిషము లూరనిచ్చి పరీక్షించిన వాని నిర్మాణము స్పష్టముగ తెలియగలదు. జీవస్థానము చక్కగరంగుపట్టి విశదముగ తెలియుచుండును. ఈకణములందు సంకోచనావకాశముండదు. ఈవిషయమున తప్ప తక్కిన అంశములలో దాదపుగా నన్నిటియందును, వికారిణినిగూర్చి చెప్పిన వర్ణన తెల్ల కణములకును వర్తించును.
తెల్లకణముల వ్యాపారములు:- వీని కనేక వ్యాపారములు గలవు. అందు రెంటినిమాత్ర మిందు పేర్కొనెదము.