జంతువులనే బోలియున్నదని తోచగలదు. వికారిణి మనవలె ననేక వ్యాపారముల నెరవేర్చ గలదై యున్నను దానికి కరచరణాద్య వయవములు లేవు. ఇట్లు అవయవరహితమైన నిర్మాణముగలదగుట చేతనే యిది ప్రాణులలో మొట్ట మొదటిదిగ నెన్నదగియున్నది.
షరా:- జీవస్థానముగాని సంకోచనావకాశముగాని లేకయే, తక్కిన సమస్తాంశములయందును వికారిణిని బోలియుండు ప్రాణులును కొన్ని గలవు. వీనిని ప్రాణులలో ఆద్యములుగను, నిజముగ అవయవరహితమైనవిగను గ్రహింపదగును. ఈప్రాణులు వికారిణికి పూర్వావస్థ యని చెప్పదగును. జీవసృష్టి యీ ప్రాణులతో ప్రారంభమై యుండవచ్చును. చిరకాలమునకు ఈజాతి ప్రాణులు జీవస్థానమును, సంకోచనావకాశమును పొందిన వగుటచే వికారిణిరూపముగ పరిణమించి యుండవచ్చునని కొందరు శాస్త్రజ్ఞు లూహించుచున్నారు. మరికొందరు జీవస్థానము లేనిదే యేకణమును జీవింప నేరదనియు, ప్రస్తుతము మనము ఉపయోగించెడు సూక్ష్మదర్శనులతో పరీక్షించునప్పుడు కొన్ని కణములందు జీవస్థానమును మనము కనిపెట్ట లేకున్నను, ఇంతకంటె హెచ్చుదృశ్శక్తి గల యంత్రములచే ముందుముందు దానిని తెలిసికొన గలుగుదు మనియు అభిప్రాయపడుచున్నారు.
వికారిణియొక్క నివాసమునకు తగినస్థితిగతులు.
శీతోష్ణపరిమాణము (Temperature)15°C -20°C భాగము (డిగ్రీ-Degree) లలో నుండు నీళ్లలో వికారిణి సమాన్యముగా నివసించును. ఆనీళ్లను క్రమముగా కాచినయెడల కొన్నిభాగ