Jump to content

పుట:Jeevasastra Samgrahamu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(Para) లో వికారిణికి క్రొత్త మూలపదార్థము సదా చేరుచుండుటవలన క్రమముగా అది పెరుగుచుండునని చెప్పియుంటిమి. ఇట్లెడతెగక పెరుగుచుండెడి వికారిణి కొంత నిర్ణీతపరిమాణమువరకు పెరుగును గాని అంతకంటె నెన్నడును పెద్దది కాదు. దీనికి కారణ ముండవలెను. మన మేదయినను పనిచేసినప్పుడు మన శరీరమునందలి మాంసపుకండలు మొదలగు పదార్థములు ప్రాణవాయువుతో గూడి బొగ్గుపులుసుగాలి రూపమున మన దేహమునుండి వెడలిపోవుటచే మన శరీరముయొక్క తూనిక తగ్గును. దీపము వెలుగుకొలది చమురు తగ్గిపోవుటయు నిట్టిదే. వికారిణి విషయములో జరుగునదిగూడ నింతయే. అది యాహారము నిమిత్తముగాని, చలనము నిమిత్తముగాని యొక పాదమును చాచుటయు, మరియొక దాని ముడుచుటయు దానికి కొంతపని యనదగు. ఈ పనివలన దాని మూలపదార్థములో కొంతభాగము ప్రాణవాయువుతో మిళితమగును. వికారిణి తినునట్టి ఆహారమునుండి పక్వమై చేరుచు జమయగు మూలపదార్థము అది చేయు పనులవలన ఖర్చుపడు మూలపదార్థముకంటె మించినయెడల వికారిణి పెరుగును. జమయగు మూలపదార్థముకంటె ఖర్చుపడు మూలపదార్థము హెచ్చగునెడల వికారిణి క్రమక్రమముగ క్షీణించును. జమయగునదియు ఖర్చగునదియు సమానమైనయెడల వృద్ధిగాని క్షయముగాని లేక యథాప్రకారముగ నుండును.